ప్రణాళిక తప్పింది | Sakshi
Sakshi News home page

ప్రణాళిక తప్పింది

Published Mon, Dec 29 2014 2:06 AM

ప్రణాళిక తప్పింది

 పది వేల కోట్లు కూడా మించని వ్యయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద
రూ. 48 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన
మార్చి 31 నాటికి రూ. 25 వేల కోట్లు దాటదంటున్న నిపుణులు
అదే సమయంలో పట్టపగ్గాల్లేని ప్రణాళికేతర వ్యయం
రూ. 500 కోట్ల ‘విచక్షణ’ నుంచి పైసా విడుదల చేయని సీఎం కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిధులు నీళ్లలా ఖర్చవుతున్నాయి.. కానీ, ఆస్తుల కల్పన వ్యయం మాత్రం ముందుకు సాగడం లేదు. కొత్త రాష్ట్రంలో లక్షా ఆరువందల కోట్ల భారీ బడ్జెట్‌ను తెలంగాణ శాసనసభ ఆమోదించిన సంగతి విదితమే. అందులో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం మధ్య తేడా రూ.3 వేల కోట్లు మాత్రమే. అయితే గడిచిన 7 నెలల కాలంలో జరిగిన వ్యయం పరిశీలిస్తే.. ప్రణాళికేతర వ్యయం ‘కళ్లెం లేని గుర్రం’లా దూసుకుపోతోంది. ప్రణాళిక వ్యయం మాత్రం నత్తను మరిపిస్తోంది. అయిన కొద్దివ్యయంలోనూ ఆస్తుల కల్పనకు వినియోగించిన నిధులు చాలా తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆశించిన స్థాయిలో నిధులు వ్యయం అయ్యే అవకాశం లేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణలో ఆస్తుల కల్పనలో భాగంగా ఇంటింటికీ తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్ పథకం, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ, ఆర్‌అండ్‌బీ రహదారులు, పాఠశాలల నిర్మాణం, ఆసుపత్రులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద హాస్టల్స్ నిర్మాణం, కళాశాల భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే, వీటిలో ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్నీ ప్రారంభించలేదు. ఇవన్నీ ఇంకా ప్రణాళిక, అంచనాల రూపకల్పన, ఆర్థిక శాఖ అనుమతుల దశల్లోనే ఉన్నాయి. వీటికి అనుమతులు వచ్చి... టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.

 రాష్ట్రంలో ఏడు నెలల వ్యవధిలో దాదాపు రూ.35 వేల కోట్ల మేరకు వ్యయం జరిగితే అందులో ప్రణాళికేతర వ్యయమే రూ. 25 వేల కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయం పదివేల కోట్ల రూపాయల లోపే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్రణాళిక వ్యయంలో ఆస్తుల కల్పనకు మూడు వేల కోట్ల రూపాయలు మించి వ్యయం చేయలేదని ఉన్నతస్థాయివర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 48 వేల కోట్ల రూపాయలు ప్రణాళిక వ్యయం కింద ఖర్చు చే యాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించినా... మార్చి 31 నాటికి అది 25 వేల కోట్ల రూపాయలకు మించే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలకు ఈ ఏడాదిలో నాలుగువేల కోట్ల రూపాయలు కేటాయిస్తే.. ఈ రెండు పథకాలు ఇంకా ప్రారంభ దశను కూడా చేరుకోలేదు. వాటర్‌గ్రిడ్ పథకంలో ఇంకా సర్వేల పర్వం కొనసాగుతుంటే.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పరిపాలన, ఆర్థిక అనుమతుల దశలోనే ఉంది. వచ్చేనెలలో టెండర్లు పిలిచి.. పనులు ప్రారంభమైనా మూడు నెలల కాలంలో ఆశించిన మేరకు వ్యయం జరిగే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రణాళిక పద్దుల కింద 15వేల కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ.. ఆ మేరకు నిధులు విడుదల అవుతాయా అన్నది అనుమానమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి 2,200 కోట్లు రావాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

 సీఎం విచక్షణకు రూ.500 కోట్లు..
 సీఎం విచక్షణతో అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి దాదాపు రూ. 500 కోట్లు  పెట్టారు. అయితే ఈ నిధుల నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సమాచారం.
 

Advertisement
Advertisement