రామరాజ్యం స్థాపిద్దాం  | Sakshi
Sakshi News home page

రామరాజ్యం స్థాపిద్దాం 

Published Mon, Nov 12 2018 7:30 PM

Mission 70 Swami Paripoornananda - Sakshi

సాక్షి, తాండూరు: రాష్ట్రంలో మిషన్‌ 70లో భాగంగా డెభ్బై ఎమ్మెల్యే స్థానాలను సొంతం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆదివారం బీజేపీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి పటేల్‌ రవిశంకర్‌ ఆధ్వర్యంలో విజయ సంకల్ప శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడతానని తెలిపారు. దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజల ఆశాకిరణం ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అభివర్ణించారు. హిందూ ధర్మం కోసం తాను మాట్లాడినందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు తనను తెలంగాణ నుంచి బహిష్కరించిందని, అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనను రాష్ట్రంలో ఆవిష్కరించారని తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణ ప్రకాషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తానని మాట తప్పారని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల విషయంలో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాముని కోసం వానరాలు ఎలా సేవ చేశాయో.. అదేవిధంగా తాండూరులో రవిశంకర్‌ గెలుపు కోసం ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కోసం కుమ్ములాటలు నడుస్తున్నాయన్నారు. తాము కాంగ్రెస్‌ బగావో.. దేశ్‌కు బచావో అనే నినాదంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మైనార్టీ ఆడపడుచులను అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంటే ప్రంద్రా మినిట్‌ ఓవైసీ సోదరులు ఎక్కడికెళ్లారని ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. పంద్రామినట్‌ అంటున్న వారు.. మత బూచీని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబపడుతుందన్నారు. ముస్లిం ఆడపడుచులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ భేటీ బచావో భేటీ పడావో పథకం ప్రవేశపెట్టారని, ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిజాం నవాబులు, రజాకార్ల పాలనను కొనసాగిస్తోందని మండిపడ్డారు. మోదీ ఏనాడు మతాన్ని అడ్డుపెట్టుకోలేదన్నారు. ప్రస్తుతం ముస్లింలు సైతం బీజేపీ వెంట నడుస్తున్నారని తెలిపారు. అమిత్‌ షా నేతృత్వంలో దేశంలోని ఒక్కొ రాష్ట్రం కాషాయమయంగా మారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో తాను ఎన్నికల ప్రచారం చేసి  కాషాయ తెలంగాణగా మారుస్తానని చెప్పారు. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న పార్టీలను తరిçమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు.  

ప్రమాణం చేయిస్తారా.. 
రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తామని కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రమాణం చేస్తారా.. అని పరిపూర్ణానంద స్వామి సవాల్‌ విసిరారు. బీజేపీ అభ్యర్థులతో తాను ప్రమాణం చేయిస్తున్నానని తెలిపారు. రామరాజ్యాన్ని స్థాపిద్దామని అని సూచించారు. తాను ప్రచారం నిర్వహిస్తుంటే సీఎం అవుతారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారని, తాను పదవుల కోసం పాకులాడడం లేదని స్పష్టం చేశారు. కేవలం హిందూ ధర్మ రక్షణ కోసమే బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. తాండూరులో కాలుష్యం వీపరీతంగా ఉందన్నారు. రవిశంకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్లు ప్రజల కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈసారి కాంగ్రెస్‌ క్రిస్టియన్‌ మేనిఫెస్టో, టీఆర్‌ఎస్‌ నిజాంల మేనిఫెస్టోతో ముందుకొచ్చాయని ధ్వజమెత్తారు. బీజేపీది మాత్రం హిందూ ధర్మ మేనిఫెస్టోతో పాటు  బలహీన వర్గాలు, రైతులకు మేలు చేకూరేలా మెనిఫెస్టో ప్రవేశపెట్టిందన్నారు.  

రామ మందిరం నిర్మిస్తున్నాం.. 
ఉత్తరప్రదేశ్‌లో కాషాయం ఎగిరింది. భోగాల పాలన అంతం కావడంతో యోగి ప్రభుత్వంలో రామమందిరం నిర్మిస్తున్నమాని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ను హిందూపురం, మహబూబాబాద్‌ పేరు మానుకోట, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, వికారాబాద్‌ను అనంతగిరిగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం సేడం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ పటేల్‌ తెల్కూర్, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి పటేల్‌ రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, చేవెళ్ల పార్లమెంట్‌ ఇంచార్జ్‌ జనార్దన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సింలు, జిల్లా అధికార ప్రతినిధి పటేల్‌ రవిశంకర్, నాయకులు మనోహర్‌రావు, శెట్టి రమేష్, కృష్ణ ముదిరాజ్, సత్యయ్యగౌడ్, హన్మంతు, రవీందర్, మహిపాల్, రాములు నాయక్, సుధీర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ కులకర్ణి, అంతారం లలిత, పటేల్‌ జయశ్రీ, గాజుల శాంతుకుమార్, వాలి శివకుమార్, శివరాజ్, మాధవరెడ్డి తదితరులున్నారు. 

Advertisement
Advertisement