‘మిషన్ కాకతీయ’కు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’కు సర్వం సిద్ధం

Published Sun, Mar 1 2015 2:42 AM

Mission kakatiya

సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల ఆరంభానికి అంతా సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లో లేని నాలుగు జిల్లాల్లో పనులను ఈ వారంలోనే ఆరంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్న 9651 చెరువులకుగానూ ఇప్పటికే 4 వేలకుపైగా చెరువులకు పరిపాలనా అనుమతులు పూర్తవగా మరికొన్ని వేల చెరువులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

కాంట్రాక్టర్లతో ఒప్పందాల ప్రక్రియ సైతం శరవేగంగా సాగుతోంది. ఈ దృష్ట్యా ఎన్నికల కోడ్ లేని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నాలుగు జిల్లాల్లో ఒకే రోజుప్రారంభించేలా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరువు పనులపై మంత్రి హరీశ్‌రావు వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. నోడల్ అధికారులు జిల్లాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను వెంటనే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. కాగా, శనివారం చెరువు పనులకు మరో రూ. 56.31 కోట్ల పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులపై హరీశ్‌రావు మరో సమీక్ష నిర్వహించారు. ఈ బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.10 వేల కోట్ల మేర బడ్జెట్ ఉండే అవకాశం ఉందని, ఆ మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లుగా తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement