Sakshi News home page

మీ తోడ్పాటు లేకుండా 'నో' మిషన్ కాకతీయ

Published Fri, Feb 20 2015 11:08 AM

మీ తోడ్పాటు లేకుండా 'నో' మిషన్ కాకతీయ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మిషన్ కాకతీయకు ఎన్ఆర్ఐ తోడ్పాటు తప్పనిసరి అని నీటి పారుదలశాఖా మంత్రి  హరీష్ రావు అన్నారు. తమ ప్రభుత్వం ఈ విషయంలో ఎంతటి అంకిత భావంతో ముందుకు వెళుతుందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా  ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రతి ఎకరా సాగుకు వచ్చి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కానుందని చెప్పారు.

తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో యూఎస్, యూకే, ఆస్ర్టేలియా, గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో దాదాపు 715 మంది తెలంగాణ ఎన్ఆర్ఐలతో మాట్లాడిన హరీష్ రావు... మిషన్ కాకతీయ సాధ్యం కోసం ఎన్ఆర్ఐలు కచ్చితంగా పాల్గొనాలని కోరారు. దీనికయ్యే నిధుల కోసం టీ జాక్ తో పాటు, నాలుగు లక్షల మంది టీఎన్జీవోలను భాగస్వాములను చేసినట్లుగానే విదేశాల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తున్నామని ఆయన ఎన్ఆర్ఐలతో చెప్పారు.

నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి దానిని పారదర్శకంగా నిర్వహిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు పలు కార్యక్రమాల్లో సాయాన్ని అందించినట్లుగానే ఇకపై కూడా టీడీఎఫ్ సాయం అందించాలన్నారు. తెలంగాణలో వెయ్యేళ్లపాటు చెరువులు ప్రధాన పాత్ర పోషించాయని, అయితే అనంతర పాలకులవల్ల అవి పూర్వవైభవం కోల్పోయాని చెప్పారు. ఏడాదికి 9000 చొప్పున 2019నాటికి మొత్తం 45వేల చెరువులను పునరుద్ధరిస్తామని, ఇందుకోసం 20 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు చెప్పారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ ఆర్ఐలు కూడా చేయూత నివ్వాలన్నారు.  చెరువులు పూర్తయితే 250 టీఎంసీల నీటిని నిల్వచేసుకోవడమే కాకుండాదాదాపు 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అందుకు యుద్ధప్రాతిపదికను ముందుకు వెళతామని హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement