Sakshi News home page

గోల్‌మాల్‌గా గ్రేటర్‌ ఓటు.. పోటెత్తిన బోగస్‌

Published Fri, Nov 9 2018 9:16 AM

Mistakes In Hyderabad Voter Lists - Sakshi

సాక్షి సిటీబ్యూరో: మహానగర పరిధిలోని ఓటరు లిస్టులో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇంటింటి సర్వేలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు ఎంత బాధ్యతా రహితంగా వ్యవహరించారో వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఓటరు లిస్టులో జరిగిన తప్పులపై బీఆర్‌ఓ, సూపర్‌వైజర్, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలకు అధారాలు చూపించి ప్రశ్నిస్తే ఆ పొరపాటు తనది కాదంటే తనది కాదంటూ ఒకరిపై మరొకరు నెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఓటరు లిస్టును పరిశీలించి సరిచేయాలి. ఇక్కడ మాత్రం సూపర్‌వైజర్లు గాని, బూత్‌లెవెల్‌ అధికారులు గాని ఆయా నియోజకవర్గాల్లో ఇళ్లకు వెళ్లలేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సూపర్‌ వైజర్లు తమ పర్యవేక్షణ బాధ్యతలను ఇతర వ్యక్తులకు అప్పగించారని, అదేవిధంగా బూత్‌లెవెల్‌ అధికారులు కూడా ఇంటింటి సర్వేకు వెళ్లకుండా కొందరికి రోజువారిగా డబ్బులు ఇచ్చి ఆ పని అప్పగించినట్టు తేలింది. ఈ రోజువారి డబ్బులు తీసుకున్నవారు సైతం అసలు సర్వేకే వెళ్లకుండా పోలింగ్‌బూత్‌ లేదా స్థానిక నాయకుల ఇళ్లలో కూర్చొని వారి సూచనలకు అనుగుణంగా ఓటరు లిస్టుల్లో సవరణలు చేసినట్టు విచారణలో బయటపడింది. జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాల ప్రకారం జరగాల్సిన అత్యంత ప్రధానమైన పని ఎవరికి వారే తమది కాదని నిర్లక్ష్యంగా చేయడం గమనార్హం.  

జిల్లాల్లో అలా.. గ్రేటర్‌లో ఇలా..  
బాధ్యతాయుతమైన ఓట్ల సవరణను జీహెచ్‌ఎంసీ అధికారులు అర్హత, అనుభవం లేని వారు, అసలు సంబంధం లేని వ్యక్తుల చేతికి అప్పగించారు. బూత్‌ లెవల్‌ అధికారులుగా ఆశావర్కర్లు, ఆంగన్‌వాడీ టీచర్లు, వైద్య, విద్య శాఖలో కింది స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారికి అప్పగించారు. జిల్లాల్లో ఇందుకు భిన్నంగా సాగింది. అక్కడ బూత్‌ లెవెల్‌ అధికారులుగా రెవెన్యూ, రెగ్యుల్‌ టీచర్లు, గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన వారు, అనుభవజ్ఞులైన ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను నియమించారు. అర్హత లేని సిబ్బంది, ఓట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తప్పులు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు అవకాశం ఉండదు. అదే రెగ్యులర్‌ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. దీంతో జాగ్రత్తగా విధులు నిర్వహించారు. 

సవరించిన తప్పులే మళ్లీమళ్లీ..  
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటరు లిస్టులో ఎలాంటి తప్పులు లేకుండా చూసేందుకు రెండు నెలలు ముందే జీహెచ్‌ఎంసీ ఉన్నత అధికారులు సమగ్ర సర్వే చేపట్టారు. ఆ బాధ్యతను బూత్‌లెవెల్‌ అధికారులకు అప్పగించారు. గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో బూత్‌లెవెల్‌ అధికారులు సరవరించిన ఓటరు లిస్టుతో ‘సాక్షి’ ప్రతినిధి ఆయా ప్రాంతాల్లో సర్వే చేసినప్పుడు భారీగా తప్పలు బయటపడ్డాయి. ఓటరు లిస్టులో ఉన్న ఇంటి నంబర్లు ఆయా ఏరియాల్లో లేవు. ఇంటి నంబర్లకు వార్డు నంబర్లకు పొంతన లేదు. ఇదిలాఉంటే సర్వే చేసిన అంగన్‌వాడీ టీచర్లు ఎక్కడన్నా ఇంట్లోని ఓటర్లు కంటే.. లిస్టులో అధికంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ‘సాక్షి’ వద్ద తమ బాధను వెళ్లబోసుకున్నారు. మరో ఏరియాకు వెళ్లి అక్కడి ఆశా వర్కర్‌ బూత్‌లెవల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళకు ఒకే ఇంటిపై దాదాపు 200కు పైగా ఓట్లున్నాయని, ఆ ఇంటికి మీరు వెళ్లారాని అడిగితే.. అక్కడ నాయకులు తమను బెదిరిస్తున్నారని, ఓట్లు తాము చెప్పినట్టే ఉండాలని హెచ్చరిస్తున్నారని వాపోయారు. చాలా తప్పులను సవరించి సూపర్‌వైజర్లకు అందించినా తిరిగి అవే పేరుతో గత నెల 12వ తేదీన విడదలైన లిస్టులో ఉన్నాయన్నారు. తాము కొన్ని రోజుల కోసం విధులు నిర్వహిస్తున్నామని, పై అధికారులే ఇలా చేస్తే ఓటరు లిస్టు ఎలా మారుతుందని ఓ మహిళా బూత్‌లెవెల్‌ అధికారి ప్రశ్నించారు. ‘సాక్షి’ సర్వేలో గుర్తించిన తప్పుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.. 

15 మంది ఉన్న ఇంట్లో 255 ఓట్లు
యాకుత్‌పూర నియోజకవర్గంలోని డోర్‌ నంబర్‌ 17–1–175లో నివాసముంటున్న వారి సంఖ్య 15 మంది. వీరిలో 12 మందికి ఓటు హక్కు ఉంది. కానీ తాజా ఓటరు లిస్టులో అదే ఇంటి నంబర్‌లో మొత్తం 255 ఓట్లు ఉన్నాయి. గతంలో ఉన్న లిస్టులో అయితే ఆ సంఖ్య 500 ఉండేది. కొత్తగా వచ్చిన లిస్టు నుంచి సగం ఓట్లు రద్దు చేశారు. అయినా తప్పులు మాత్రం పూర్తిగా సవరించాలేదు. బూత్‌ నంబర్‌ 56లో సీరియల్‌ నంబర్‌ 364 నుంచి 737 వరకు ఒకే ఇంటి నంబర్‌పై 373 ఓట్లున్నాయి. అంతే కాదు.. ఇదే ఇంటి నంబర్‌ ఓట్లు పోలింగ్‌ బూత్‌ 57లో కూడా సీరియల్‌ నంబర్‌ 337 నుంచి 418 వరకు 81 ఓట్లున్నాయి. ఈ ఓటరు లిస్టును పరిశీలిస్తే బీఆర్‌ఓల నుంచి ఏఈఓల వరకు ఎంత నిర్లక్ష్యంగా పని చేశారో అర్థం చేసుకోవచ్చు. 

ఓకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు  
నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్‌ 10–6–182లో ఉంటున్న జహీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఓటు బూత్‌ నంబర్‌ 94, సీరియల్‌ నంబర్‌ 909లో ఉంది. తిరిగి ఇతని పేరు, అదే ఫొటోతో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 61లో సీరియల్‌ నంబర్‌ 1006గా ఉంది. ఇక్కడ ఎలాంటి మార్పులు లేకుండా ఇంటి నంబర్, తండ్రి పేరు, వ్యక్తి పేరుతో ప్రచురించడం గమనార్హం. ఈ తప్పులు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా ఒకే వ్యక్తికి ‘డబుల్‌’, త్రిబుల్‌’ ఓట్లు గ్రేటర్‌ పరిధిలోని చాలామందికే నమోదు చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement