వరికోల్‌ శ్రీమంతుడు శ్రీనివాసరెడ్డి | Sakshi
Sakshi News home page

వరికోల్‌ శ్రీమంతుడు శ్రీనివాసరెడ్డి

Published Sat, Apr 14 2018 1:32 PM

MLA Challa Dharma Reddy Visit Village Devolopments - Sakshi

పరకాల రూరల్‌: వరికోల్‌ గ్రామ ముద్దుబిడ్డ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి శ్రీమంతుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వరికోల్‌ గ్రామంలో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు, డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శిæ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతర గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్డు, సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణ పనులను పీఆర్‌ డీఈ లింగారెడ్డి వివరించారు. గ్రామంలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో రూ.2.5కోట్ల పనులు చేపట్టగా 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గ్రామంలో ఆరు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

ఆర్‌డబ్ల్యూస్‌ డీఈ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రూ1.53కోట్లతో 16.85 కిలో మీటర్ల పైపులైన్‌ నిర్మాణానికి 9 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ వరికోల్‌ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. గ్రామంలో చేపట్టిన రోడ్డు పనులు, సైడ్‌ డ్రైన్‌లు, గ్రామ పంచాయతీ భవనం, మిషన్‌భగీరధ పనులు మే 15వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ పథకాల అమలులో స్థానిక ప్రజలు అధికారులకు గాని, నాయకలకు గాని ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దని అన్నారు. రాష్ట్రంలోనే తన గ్రామం ఆదర్శంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాని తెలిపారు.

గ్రామంలో నిర్మిస్తున్న 150 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రానున్న దసర పండుగ నాటికి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే విధంగా పూర్తి చేయనున్నామన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యడిగా ఎన్నికైన జోగినపల్లి సంతోష్‌కుమార్‌ నిధుల నుంచి రూ.కోటితో ఆధునిక హంగులతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వికలాంగ సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్‌ రాజభద్రయ్య, కౌన్సిలర్‌ మడికొండ సంపత్, తహసీల్దార్‌ హరికృష్ణ నాయక్, ఎంపీడీఓ ఎం.శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాడి ప్రతాప్‌రెడ్డి, చందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement