Sakshi News home page

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Published Sun, Mar 22 2015 9:02 PM

mlc elections polling completed in telangana

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 70 శాతం, ఉభయగోదావరి జిల్లాల్లో 83.71 శాతం, నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 51 శాతం పోలింగ్ నమోదైంది.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా పోలింగ్ జరిగింది. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 38శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు దేవీప్రసాద్, రామచందర్‌రావులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు ఓటర్లుగా అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ శాతం నమోదైనా, ఇది గతం (27.16శాతం) కంటే 10.84శాతం ఎక్కువ అని పోటీలో ఉన్న ఆయా పక్షాలు సంతృప్తి చెందుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా, 1,12,600 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాల వారీగా చూసినప్పుడు మహబూబ్‌నగర్‌లో 55శాతం, రంగారెడ్డిలో 34శాతం, హైదరాబాద్‌లో 29 శాతం మొత్తంగా 38 శాతం పోలింగ్ జరిగింది. ఇక, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో మాత్రం కొంత ఫర్వాలేదనిపించేలా 53 శాతం పోలింగ్ నమోదైంది. 22 మంది అభ్యర్థులున్న ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ మధ్య కొనసాగింది. 2,81,138 ఓట్లలో 1,49,003 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌లో 51.36శాతం, ఖమ్మంలో 50.01శాతం, నల్లగొండలో అత్యధికంగా 58శాతం చొప్పున ఓట్లు పోల్ కాగా, మొత్తంగా 53శాతం పోలింగ్ జరిగింది.

25న ఓట్ల లెక్కింపు
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 25వ తేదీన జరుగనుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్ ఇస్సామియా బజార్‌లోని విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజిలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు ఇక్కడ 20 టేబుళ్ళు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement