Sakshi News home page

నిమ్స్‌కు వస్తే నరకమే: ఎమ్మెల్సీ ప్రభాకర్

Published Tue, May 19 2015 2:52 PM

నిమ్స్‌కు వస్తే నరకమే: ఎమ్మెల్సీ ప్రభాకర్

పంజగుట్ట (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రి రోగుల పాలిట నరకప్రాయంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. నిమ్స్ చైర్మన్‌గా ఉన్న సీఎం కేసీఆర్ ఆస్పత్రి అభివృద్ధి గురించి పట్టించుకోకుండా స్వచ్ఛ హైదరాబాద్ అంటూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. నిమ్స్ ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రభాకర్ మూడు రోజుల క్రితం వచ్చారు. అన్ని పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మంగళవారం పరీక్ష చేసే ముందు వైద్య సిబ్బంది ప్రభాకర్‌తో 20 మాత్రలను కూడా మింగించారు. తీరా మిషన్ పనిచేయడం లేదని, రేపు చేద్దామని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవంపై ప్రభాకర్ మంగళవారం ఆస్పత్రి బెడ్ వద్దే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు సరిగా లేవన్నారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే ఇలా జరిగితే సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. యాంజియోగ్రామ్ పరీక్ష మొదలైన తర్వాత మిషన్ పనిచేయడం ఆగిపోతే ఏం జరిగేదన్నారు. వార్డుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బొద్దింకలు, నల్లులతో రోగులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. 309 మంది వైద్యులకు కేవలం 102 మందే ఉన్నారని, ముందులు కూడా సరిగా లభించడం లేదన్నారు. చివరకు టీటీ ఇంజక్షన్ కూడా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌పై కూడా ఆరోపణలు చేశారు.

Advertisement
Advertisement