సమాజాభివృద్ధికి కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధికి కృషి చేయాలి

Published Sun, Dec 29 2019 2:30 AM

Mohan Bhagwat Attends NCC Samashti Seva Puraskar Award Ceremony - Sakshi

హైదరాబాద్‌: మనం సంపాదించిన దాంట్లో మనకు అవసరమైనంత ఉంచుకుని మిగతాది.. ఆ సంపదను ఇచ్చిన సమాజానికి ఖర్చు చేసినపుడే మనిషి జీవితం సార్థకమైనట్లు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధి వట్టినాగులపల్లి శివారులో ఉన్న అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్‌సీసీ సమష్టి సేవా పురస్కార్‌ ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పురస్కారంతో పాటు రూ.కోటి చెక్కును తన చేతుల మీదుగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజానికి డబ్బు, సమయం ఇచ్చి సమాజాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజానికి విద్య, వైద్యంతో పాటు అనేక మౌలిక సదుపాయాలను కల్పించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సంపన్నులు తీసుకోవాలని సూచించారు. ఈ సమాజంలో కోట్లాది మంది గుప్త దానాలు చేసే నిస్వార్థపరులు ఉన్నారని, సేవ చేసినంత మాత్రాన ఎక్కువగా, పొందినంత మాత్రాన తక్కువగా భావించవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సేవ చేస్తారని, వారు సెలవులో ఉంటే వాటిని పక్కన పెడతారని, తమ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సేవా కార్యక్రమాలకు సెలవే లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతిఫలం ఆశించే గుణం లేదని, కేవలం సేవ చేయటమే తమ విధిగా భావించి ముందుకు వెళ్లటంతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు వివరించారు.

అదే సేవా నిరతితో పాటు వేదం, ఉపనిషత్తులతో నడుస్తున్న భారత్‌ ఎప్పటికైనా విశ్వగురువు కావటం ఖాయమన్నారు. దేశానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భారతరత్న అవార్డు గ్రహీత నానాజీ దేశ్‌ముఖ్‌ 1968లోనే దీన్‌దయాల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఎన్‌సీసీ చేపడుతున్న నిర్మాణాలు, దీన్‌దయాల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ సంస్థ చైర్మన్‌ హేమంత్, వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ రాజు, ఎండీ రంగరాజు, డైరెక్టర్‌ ఏవీఎన్‌ రాజుతో పాటు మాజీ డీజీపీ అరవింద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement