పోలీస్‌స్టేషన్లపై నెలవారీ మదింపు! | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్లపై నెలవారీ మదింపు!

Published Wed, Jul 30 2014 3:05 AM

పోలీస్‌స్టేషన్లపై నెలవారీ మదింపు! - Sakshi

* సీఐలు, ఎస్‌ఐల పనితీరుపై కూడా..
* సీనియర్ ఐపీఎస్‌లతో ఆకస్మిక తనిఖీలు
* పోలీసు పని విధానంలో సమగ్ర మార్పులు
* ఉన్నతస్థాయిలో రూపుదిద్దుకుంటున్న ప్రణాళికలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పనివిధానంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తున్న సర్కారు.. మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్‌ఐల పనితీరుపై మదింపు జరపాలని నిర్ణయించింది.  ప్రతి పోలీస్‌స్టేషన్ పనితీరుపై కూడా నెలవారీగా సమీక్షలు జరపాలని యోచిస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణకు డీజీపీ మెరుగులు దిద్దుతున్నారు. పోలీసుపని విధానంలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ‘పీపుల్స్ ఫ్రెండ్లీ’ పోలీసు విధానానికి అనుగుణంగా మార్చాలని యోచిస్తోంది.
 
 ఈ నేపథ్యంలోనే పోలీస్‌స్టేషన్లతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది పని విధానంపై ప్రతినెలా మదింపు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఎన్ని కేసులపై వెంటనే చర్యలు తీసుకున్నారు? ఎన్ని కేసులు దర్యాప్తు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతోంది? అందుకు కారణాలేమిటనే అంశాలపై  ఎస్పీలు, సబ్ డివిజనల్ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని దానిని డీజీపీకి పంపించేలా చర్యలు తీసుకోబోతున్నారు. దీనివల్ల ఆయా పోలీస్‌స్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు జాగ్రత్తగా పనిచేయడమే కాకుండా కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై కన్నేసి ఉంచడానికి వీలవుతుందని చెబుతున్నారు. అలాగే స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నప్పటికీ,  కొన్ని నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకోకుండా దర్యాప్తు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడానికి రెండు మూడు నెలలకోసారి డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మిక తనిఖీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నగరాల్లో పోలీసు కమిషనర్లు, జిల్లాల్లో రేంజ్ డీఐజీలు, రీజియన్ ఐజీలతో..కొన్ని సందర్భాల్లో డీజీపీ కూడా ఆకస్మిక తనిఖీ చేయాలని భావిస్తున్నారు.
 
 ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్న పోలీస్‌స్టేషన్లపై సమీక్ష జరిపి, సమస్యలను పరిష్కరించడం ద్వారా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేయనున్నారు. ఇక ప్రతి పోలీస్‌స్టేషన్‌ను మూడు నాలుగు సెక్టార్లుగా విభజించి ఎస్‌ఐలకు సెక్టార్ బాధ్యతలను అప్పగించనున్నారు. మంచి పోలీసు స్టేషన్లకు పురస్కారాలు కూడా ఇవ్వనున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణను పోలీసు ఉన్నతాధికారులు.. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు సమర్పించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement