మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత | Sakshi
Sakshi News home page

మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత

Published Tue, Jul 7 2015 1:28 AM

మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత - Sakshi

* తెలంగాణలో 29 నుంచి ప్రారంభం
* ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 6 నుంచి మొదలయ్యే అవకాశం
* ఒకట్రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం
* తెలంగాణ కళాశాలలకు హైదరాబాద్, వరంగల్, విజయవాడల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. తొలుత తెలంగాణలో ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఏపీలో మెడికల్ కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 30లోగా అన్ని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కావాలన్నది భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నిబంధన . ఈ నేపథ్యంలో తొలుత తెలంగాణలోని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం ఉంటాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులతోపాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, వైద్యవిద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొన్నటివరకు 2,950 ఎంబీబీఎస్ సీట్లుండగా, ఇటీవలే మల్లారెడ్డి వైద్య కళాశాలలకు సంబంధించి 300 సీట్ల రెన్యువల్‌కు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. దీంతో సీట్లు 2,650కి తగ్గాయి.   ప్రభుత్వకళాశాలల్లో 850 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 1,800 సీట్లున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 1,800 సీట్లలో 900 సీట్లను కన్వీనర్ కోటా కింద వర్సిటీయే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. అంటే మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు డెంటల్ సీట్లను 29 నుంచి జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
 
 ఏపీలో కౌన్సెలింగ్‌పై 2 రోజుల్లో స్పష్టత
 తెలంగాణ కళాశాలలకు సంబంధించి 29 నుంచి కనీసం ఐదు రోజులపాటు కౌన్సెలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఆగస్టు మొదటి వారంలో, వీలైతే 6వ తేదీ నుంచి ఏపీలోని వైద్యసీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరపాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడ, తిరుపతిల్లో కౌన్సెలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో  కేంద్రం పెట్టాలా వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీలోని మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేటుకాలేల్లో 1,950 సీట్లుండగా ఇందులో 975 (50 శాతం) సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. మొత్తం 2,725 ఎంబీ బీఎస్, డెంటల్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లోని మిగతా 50 శాతం ఎంబీ బీఎస్ సీట్లు.. అంటే 975 సీట్లలో 685 సీట్లను (మొత్తం సీట్లలో 35 శాతం) మేనేజ్‌మెంట్ కోటా కింద (ఎంసెట్ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా), సుమారు 268 సీట్లను(మొత్తం సీట్లలో 15 శాతం)  ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తారు. రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్ పూర్తయ్యాక యాజమాన్య కోటాను భర్తీ చేస్తారు.
 
 యాజమాన్య కోటా సీట్ల ర్యాంకులపై కసరత్తు
 ఏపీలోని 35 శాతం (మేనేజ్‌మెంట్ కోటా) సీట్లకు జరిగిన ఎంసెట్ ఏసీ (అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ర్యాంకులపై కసరత్తు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రెండు రాష్ట్రాల్లో ప్రభు త్వ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తి కాగానే ఈ సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాలతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఉంటుంది.
 - డాక్టర్ రవిరాజు, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
 
 ఇరు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు
 కోటా    తెలంగాణ    ఏపీ    
 ప్రభుత్వ కళాశాలల్లో...     850    1,750
 ప్రైవేటు కళాశాలల్లో...    1,800    1,950
 ఇందులో కన్వీనర్ కోటా (50%)    900    975
 

Advertisement
Advertisement