Sakshi News home page

భూమిపై హక్కు కోసమే దీక్ష

Published Tue, Jul 24 2018 11:06 AM

The Movement Is To Remind The Government Responsibility - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : ప్రతి రైతుకు పాస్‌బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసమే రైతు దీక్ష చేపట్టినట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మానుకోట పట్టణంలో సోమవారం టీజేఎస్‌ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్‌  నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన రైతు దీక్షలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో వాస్తవ సాగుదారులకు అన్యాయం జరిగిందన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన చరిత్రలో ఇంతకు ముందెన్నప్పుడూ జరగని పనిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో టీజేఎస్‌ పరిశీలనలో భూప్రక్షాళన మరిన్ని సమస్యలు సృష్టించి, రైతులను మరింత గందరగోళంలోకి నెట్టిందన్నారు. తమకు రెవెన్యూ అధికారులతో ఎలాంటి  గొడవలేదని, గొడవంతా ప్రభుత్వం మీదనేన్నారు.

లక్షల కొద్ది రికార్డుల్లో తప్పులు దొర్లడం, వాటి ప్రకారమే రైతుబంధు చెక్కులివ్వటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీలో మొదటి రోజే 3,07,640 పుస్తకాల్లో  తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి పంపారన్నారు.

ఇక  పంపిణీ చేసిన వాటిలో 9,11,241 తప్పులు దొర్లినట్లు అధికారికంగా గుర్తించారని  తెలిపారు. ఇవేగాక వివిధ కారణాల రీత్యా అసలు పంపిణీకి నోచుకోనివి 7,39,680 పాస్‌ పుస్తకాలు ఉన్నాయన్నా రు. తప్పులు పడిన రికార్డులను సరి చేయించుకోడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తుందన్నారు.

తమ భూమి తమకు కాకుండా పోతుందేమోననే ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు ఉండడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

ఒక పక్క వర్షాలు పడుతుంటే, వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ‘నీ చెక్కులు వద్దు.. మా భూమి మాకుంటే చాలు, రికార్డులు సరి చేసి మా పాస్‌ బుక్కులు మాకిస్తే చాలు’ అనే స్థితికి రైతులు వచ్చారన్నారు. భూమి వెట్టి నుంచి విముక్తి చేసి, రైతు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు.

ఇప్పుడు భూప్రక్షాళనలో పేదల భూములపై కాస్త బడా రైతుల పేర్లతో పాస్‌ పుస్తకాలు రావడంతో ఆందోళనకు గురవుతున్నారని కోదండరాం అన్నా రు. ఫారెస్ట్‌ అధికారులు పోడు రైతుల మీద దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తప్పులను సరిచేసి రైతులందరికీ పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని మానుకోట టీజేఎస్‌ సమన్వయకర్త డోలి  సత్యనారాయణ అన్నారు.

పోడు రైతులకు టీజేఎస్‌ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం సాక్షర భారత్‌ దీక్షా స్థలాన్ని సందర్శించిన కోదండరాం వారికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాంచంద్రునాయక్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సునీత, టీజేఎస్‌ నాయకులు పిల్లి సుధాకర్, భూక్యా సత్యనారాయణ, నారాయణసింగ్, మనోజ్, మాలోతు వెంకన్న, శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement