నెరవేరని ఎయిమ్స్! | Sakshi
Sakshi News home page

నెరవేరని ఎయిమ్స్!

Published Thu, Jan 22 2015 2:53 AM

నెరవేరని ఎయిమ్స్! - Sakshi

* ఎంపీ కొండా ప్రయత్నం వృథా ప్రయాసే
* బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటన

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒంటరి పోరు వృథా ప్రయాసగా మారింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అఖిల భారత వైద్య, విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను జిల్లాలో స్థాపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ, పక్క జిల్లాకు తరలిపోవడం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్కారు తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వతహాగా వైద్యసంస్థలపై పట్టున్న కొండా.. ఎయిమ్స్ వస్తే మెడికల్ కాలేజీ కూడా దానంతట అదే మంజూరవుతుందని ఆశించి ఎలాగైనా ఈ సంస్థను జిల్లాలో నెలకొల్పాలనే పట్టుదల ప్రదర్శించారు.
 
కేంద్రంతో సంప్రదింపులు..
స్థలం కేటాయిస్తే ఎయిమ్స్‌ను నిర్మిస్తామని పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టం చేయడమే తరువాయి ప్రభుత్వ స్థలాల వేట కొనసాగించారు. రాజధానికి సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా ముచ్చర్ల, చేవెళ్ల, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన ఈ అంశంపై అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్‌తో కూడా పలుమార్లు చర్చించారు. ఎంపీ ప్రతిపాదనలతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న జవహర్‌నగర్‌లో కూడా ఎయిమ్స్ నిర్మాణాన్ని పరిశీలించాలంటూ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్ జిల్లాకు రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ముచ్చర్ల భూములను ఫార్మాసిటీకి కేటాయించడం, శేరిలింగంపల్లిలోని ప్రతిపాదిత స్థలాలను వేలం వేయాలని నిర్ణయించడం ఎంపీ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఆఖరికి జవహర్‌నగర్‌ను కూడా పరిగణనలోకి తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎయిమ్స్‌ను నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన వర్గీయులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. కొత్త ప్రాజెక్టుల ఎంపికకు రంగారెడ్డి జిల్లాను పరిగణనలోకి తీసుకోవడం ఒక ఎత్తయితే.. కనీసం ఈ వ్యవహారంలో జిల్లా ప్రతినిధులు కలిసిరాలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.

మరోవైపు ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫార్మాసిటీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరి నిర్మిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినా.. ఇప్పటివరకు కనీసం 2వేల ఎకరాలను కూడా సమీకరించకపోవడం, ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తటాపటాయిస్తున్నట్లు తెలుస్తుండడంతో ప్రభుత్వంలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఈ క్రమంలోనే సర్వే పనులను కూడా నెమ్మదిగా కొనసాగిస్తోంది.

Advertisement
Advertisement