అయ్యో ‘పాపం.. | Sakshi
Sakshi News home page

అయ్యో ‘పాపం..

Published Tue, Jun 30 2015 3:46 AM

అయ్యో ‘పాపం..

- అప్పుడే పుట్టిన పసివాడిపై కర్కశత్వం
- బ్లేడ్‌తో గొంతుకోసిన గుర్తు తెలియన వ్యక్తులు
- కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్
- అమృత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసి బాలుడు

తల్లిగర్భం నుంచి అప్పుడే బయటకు వచ్చాడు... బొడ్డు పేగు కూడా అలానే ఉంది.. ఆ చిన్నారి ఇంకా లోకాన్ని చూడనే లేదు.. అలాంటి పసివాడిపై ఎవరో కర్కశత్వం చూపారు.. బ్లేడ్‌తో గొంతు కోసి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ హృదయవిదారక ఘటన సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హన్మకొండ లష్కర్‌బజార్‌లో చోటుచేసుకుంది. స్థానికుడు కేయూ పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్ చిన్నారి రోదనలు విని అక్కడికి వచ్చి పరిశీలించారు.

నేలపై చీమలుపట్టి.. రక్తం కారుతూ ఏడుస్తూ కనిపించింది శిశువు. తక్షణమే స్పందించిన జనార్దన్ తన కుమారుడి సహాయంతో మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని సూచించడంతో కిషన్‌పురలోని అమృత ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు చిన్నారి గొంతుపై బ్లేడ్‌తో కోసినట్లుగా గుర్తించి వైద్యసేవలందించారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో ఉంచి చికిత్స పొందుతోందని, ఆరోగ్యంగానే ఉన్నట్లు అమృత ఆస్పత్రి  చైర్మన్ డాక్టర్ రమేష్ తెలిపారు. అవాంచిన గర్బం దాల్చిన యువతి అప్పుడే పుట్టిన మగబాబును చెత్తకుప్పలో వేయడంతోపాటు బ్లేడుతో కోసి ఉంటుందని స్థానికులు అంటున్నారు. చిన్నారి ఘటనపై అమృత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ స్పందిస్తూ... చిన్నారి కోలుకునే వరకు ఉచిత వైద్యసేవలందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సత్వరమే స్పందించి పసివాడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన కేయూ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ జనార్దన్‌ను పలువురు అభినందించారు.

Advertisement
Advertisement