మేడారంలో.. ఏఎస్పీ ‘విశ్వ’రూపం | Sakshi
Sakshi News home page

మేడారంలో.. ఏఎస్పీ ‘విశ్వ’రూపం

Published Thu, Feb 18 2016 12:31 PM

మేడారంలో.. ఏఎస్పీ ‘విశ్వ’రూపం

     ములుగు ఏఎస్పీ అతిప్రవర్తన
     అంబులెన్స్‌ను ఆపడంపై విమర్శలు
     ప్రభుత్వ వైద్యుడిని
     కొట్టడంపై నిరసనలు
     జాతరలో పోలీస్‌శాఖ
     ప్రతిష్టకు మచ్చ


మేడారం నుంచి సాక్షి బృందం: మేడారం మహా జాతరలో ఖాకీలు జులుం ప్రదర్శించారు. ‘వైద్యులైతేనేం.. జర్నలిస్టయితే ఏంట్రా తోలు తీ స్తా’ అంటూ ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి తన ప్రతాపం చూపించారు. ఐఎంఏ, తెలంగాణ ప్రైవేటు నర్సింగ్ అసోసియేషన్ నాయకుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చెంచులకు వైద్యం అందించే డాక్టర్ రాంకిషన్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి బుధవారం మేడారం జాతరకు వచ్చారు. వాహనాన్ని నార్లాపూర్ వద్ద నిలిపి.. 3 కిలోమీటర్ల దూరంలోని జంపన్నవాగు వద్దకు వచ్చారు. యాదగిరి భార్య సరోజినికి షుగర్ వ్యాధి ఉండడంతో కళ్లు తిరిగి పడిపోయూరు. దీంతో డాక్టర్ రాంకిషన్ ప్రాథమిక చికిత్స చేసి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను సంప్రదించి జంపన్నవాగు వద్దకు అంబులెన్స్ తెప్పించారు.

అంబులెన్స్‌లో పాశం యాదగిరి కుటుంబసభ్యులతో పాటు డాక్టర్ రాంకిషన్ ఐటీడీఏ క్యాంపు వద్దకు చేరుకోగానే వాహనాన్ని ఏఎస్పీ విశ్వజిత్ నిలిపివేశారు. ‘అంబులెన్స్‌లో ఎవర్రా?’ అని దుర్భాషలాడుతూ.. కోపంతో డ్రైవర్‌పై దాడికి దిగారు. దీంతో డాక్టర్ రాంకిషన్ ఇదేంటని ప్రశ్నించగా.. ఆయనపై కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి జోక్యం చేసుకోగా ‘నువ్వయితే ఏంట్రా.. తోలు తీస్తా’ అంటూ ఆయనను సైతం చితకబాదాడు. అంతటితో ఆగకుండా పోలీస్ క్యాంపులో నిర్బంధించారు.  అక్కడ పాశం యాదగిరిని చూసిన ఓ జర్నలిస్టు.. ఈ విషయాన్ని జర్నలిస్టు నేతలకు వివరించడంతో అంతా అక్కడికి చేరుకొని యాదగిరిని, ఆయన కుటుంబ సభ్యులు, డాక్టర్‌ను విడిపించారు.

పోలీస్ శాఖకే చెడ్డపేరు
ఏఎస్పీ స్థాయి అధికారి రోడ్డుపై వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపడమే తప్పు. దీనిపైనే పలు విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా వైద్య సిబ్బంది అయితే ఏంట్రా.. జర్నలిస్టయితే ఏంట్రా.. తోలు తీస్తా అనే పదాలు ఉపయోగించి లాఠీతో వైద్యుడిని కొట్టడం దారుణం. ఇలాంటి దుందుడుకు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసు శాఖకే చెడ్డపేరు వస్తోందని మేడారం జాతరలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఒకరు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖపై సాధారణ ప్రజల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయం ఇప్పుడిప్పుడే తొలగిపోతుంటే విశ్వజిత్ చర్యలతో అంతా పోయిందని పోలీసు సిబ్బంది అంటున్నారు. విశ్వజిత్ తీరుపై రూరల్ ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే జాతర లో పోలీసుల తీరుపై విమర్శలు ఇంకా పెరుగుతాయని సాధారణ భక్తులు అభిప్రాయపడుతున్నారు.
 
కలెక్టర్‌కు ఫిర్యాదు..
వైద్య సిబ్బందితోపాటు జర్నలిస్టుపై దాడి చేసిన ఏఎస్పీ విశ్వజిత్ కంపాటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, జర్నలిస్టు నేతలు కలెక్టర్ కరుణను కలిసి ఫిర్యాదు చేశారు. 24 గంటల్లోపు జాతర విధుల నుంచి విశ్వజిత్‌ను తప్పించకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. దీనిపై  కలెక్టర్ వెంటనే స్పందించారు. సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వైద్య సేవలకు ఆటంకం
కోటి మంది భక్తులు వచ్చే మేడారం జాతరలో వైద్య సేవలు కీలకమైన అంశం. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి తీరుతో మేడారం జాతరలో తొలిరోజే వైద్య సేవలకు అంతరాయం కలిగింది. వైద్యుడిని కొట్టిన విశ్వజిత్‌పై 24 గంటల్లోపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుంటే జాతరలో వైద్య సేవల విధుల నుంచి తప్పుకుంటామని పలువురు వైద్యులు హెచ్చరించారు. విశ్వజిత్ అతిప్రవర్తన అంశం వైద్య సేవలపై ప్రభావం చూపే అంశంపై గురువారం మధ్యాహ్నం వరకు స్పష్టత రానుంది.
 

Advertisement
Advertisement