హత్య కేసును ఛేదించిన పోలీసులు | Sakshi
Sakshi News home page

హత్య కేసును ఛేదించిన పోలీసులు

Published Tue, Apr 21 2015 4:00 AM

Murder case as Chasing the police

దుగ్గొండి :మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వివరాలను నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ వివరించారు. బిక్కాజిపల్లికి చెందిన కన్నెబోయిన రమకు ఇదే గ్రామానికి చెందిన తలబోయిన ఎల్లయ్యకు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 13న ఉదయం రమ భర్త సదయ్యకు దస్తగిరిపల్లిలోని తన అన్నయ్య వద్దకు వెళ్లాడు.

రమ సైతం గ్యాస్ పేపర్‌లు ఇవ్వడానికి దుగ్గొండికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రమ సాయంత్రం 4 గంట ల సమయంలో తలబోయిన ఎల్లయ్యకు ఫోన్‌లో మిస్‌డ్ కాల్ ఇచ్చింది. దీంతో ఆయ న మళ్లీ ఫోన్ చేశాడు. తనకు డబ్బులు కావాలని.. దుగ్గొండికి పట్టుకు రమ్మని చెప్పింది. తన వద్ద డబ్బులు లేవని ఎల్లయ్య చెప్పాడు. సాయంత్రం వరకు డబ్బులు.. ఓ బీర్ బాటిల్‌ను తీసుకుని శివాజినగర్ సమీపంలోని తన వ్యవసాయ బావి వద్దకు రావాలని చెప్పింది. దీంతో 4.30 గంటలకు ఎల్లయ్య వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.

రమ రాకపోవడంతో ఆమె వచ్చే వరకు కెనాల్‌పై కూర్చున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రమ రాగానే ఇద్దరు కలిసి వ్యవసాయ బావి గడ్డ వద్దకు వెళ్లారు. అక్కడే కూర్చొని రమ బీరు తాగింది. అనంతరం డబ్బులు ఏవి అని అడిగింది. లేవు.. రేపు ఇస్తాను అని ఎల్లయ్య చెప్పాడు. మాటామాటా పెరిగింది. నాలుగేళ్లుగా రూ.40వేలు ఇచ్చాను. ఇంకా డబ్బులు కావాలా అని ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో రమ ఎల్లయ్య భార్యపై పలు ఆరోపణలు చేసింది. దీంతో ఎల్లయ్య ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కూర్చుని ఉన్న రమ మెడపై రెండుసార్లు నరికాడు.

అక్కడికక్కడే మృతి చెందిన రమను పక్కనే ఉన్న చిన్న పొద పక్కకు నెట్టాడు. మంగళసూత్రాలు, గొడ్డలి, సెల్‌ఫోన్, బ్యాంక్ పాస్‌బుక్, గ్యాస్ బుక్‌లను తీసుకుని సంఘటన స్థలానికి సమీపంలో మూడు ప్రదేశాల్లో వేర్వేరుగా దాచిపెట్టాడు. హత్య చేసిన మరుసటి రోజు ఉదయాన్నే పరారయ్యాడు. సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని పెద్దమనుషుల ముందు హత్యానేరాన్ని ఒప్పుకోగా పెద్దమనుషులతో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు.

నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు , ఏఎస్సై రఫాయిల్, పీసీలు శ్రీనివాస్, సక్రంనాయక్, దేవేందర్ పాల్గొన్నారు. కాగా, హత్య జరిగిన ముందు రోజు భార్యాభర్తలు కలిసి ఉండడం వల్ల డాగ్ వాసనపట్టి మృతురాలి భర్త వద్దకు వెళ్లినట్లు సీఐ వివరించారు.

Advertisement
Advertisement