నా కేసు విచారించాల్సిందే.. లేకుంటే ఉరేసుకుంటా.. | Sakshi
Sakshi News home page

నా కేసు విచారించాల్సిందే.. లేకుంటే ఉరేసుకుంటా..

Published Fri, Oct 13 2017 2:20 AM

My case must be heard.. Client - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల కొరత.. కేసులు సత్వర విచారణకు నోచుకోలేని పరిస్థితులు.. ఈ నేపథ్యంలో కక్షిదారుల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. విచారణ జాబితాలో కేసులు ఉంటున్నా.. అవి ఎప్పుడు విచారణకు నోచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కక్షిదారులు రకరకాలుగా తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. లాయర్ల ద్వారా కేసులు దాఖలు చేసిన కొందరు తమ న్యాయవాదులపై అసహనాన్ని చూపుతుంటే.. న్యాయవాదితో నిమిత్తం లేకుండా సొంతం(పార్టీ ఇన్‌ పర్సన్‌)గా వాదనలు వినిపించుకునే కక్షిదారుల్లో కొందరు ఏకంగా న్యాయమూర్తులపైనే అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాజాగా కక్షిదారుడొకరు ఓ అడుగు ముందుకేసి, తన కేసు విచారించకుంటే ఇక్కడే ఉరేసుకుంటానంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్నే బెదిరించడం సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కోర్టులో తాను ధరించిన బెల్టు తీసి మెడకు బిగించుకుని ఇక్కడే ఉరివేసుకుని చచ్చిపోతానంటూ బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆ కక్షిదారుడు కేసు విచారణకు సంబంధించి ధర్మాసనాన్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఆ కక్షిదారుడి అనుచిత ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునేలా అతను వ్యవహరించారని, అతని చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తెలిపింది. కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ ఆ వ్యక్తికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అతను దాఖలు చేసిన కేసు విచారణకు వచ్చిన రోజు తప్ప, మిగిలిన రోజుల్లో తమ అనుమతి లేకుండా ఆ వ్యక్తిని కోర్టులోకి అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులకు ప్రతిభ ఆధారంగా కాక సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇచ్చారని, ఇది సరికాదంటూ ఆర్‌వీఎన్‌ఎస్‌ మూర్తి హైకోర్టులో గత ఏడాది ఫిబ్రవరిలో పార్టీ ఇన్‌ పర్సన్‌గా పిటిషన్‌ దాఖలు చేశారు. తనను రిజిస్ట్రార్‌/కంట్రోలర్‌గా తిరిగి నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం వర్సిటీ అధికారులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. తర్వాత ఈ వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో వస్తున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదు.

ఔట్‌ ఆఫ్‌ టర్న్‌ విచారించాల్సిందే..
ఈ నేపథ్యంలో మూర్తి పలు సందర్భాల్లో ఔట్‌ ఆఫ్‌ టర్న్‌(కేసును ప్రత్యేకంగా విచారించడం)గా తన కేసును విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ధర్మాసనం అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. 2001లో దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అప్పటి నుంచి 2015 వరకు పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ పక్కన పెట్టి 2016లో దాఖలై న కేసును ప్రత్యేకంగా విచారించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. బుధవారం మూర్తి దాఖలు చేసిన వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో ఉంది.

ఈ వ్యాజ్యాన్ని ఔట్‌ ఆఫ్‌ టర్న్‌గా విచారించాలని మూర్తి మరోసారి కోరారు. అది సాధ్యం కాదని ధర్మాసనం చెప్ప గా, విచారించాల్సిందేనని, లేనిపక్షంలో ఉరేసుకుంటానని బెదిరిస్తూ తన బెల్టును తీసి మెడకు బిగించుకున్నారు. తన కేసుతో ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అరవడం ప్రారంభించారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. దీంతో ధర్మాసనంతో పాటు కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులందరూ బిత్తరపోయారు. కోర్టు హాలులో అరవడం, బెల్టు తీసి మెడకు బిగించుకోవడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటి మూర్తి చర్యలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, అతని తీరు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది.

ఇది కోర్టు ధిక్కారమేనని తెలిపింది. పోలీసులను పిలిచి అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ తాము జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను అతను అందుకునేంత వరకు అతన్ని అదుపులోనే ఉంచుకోవాలని రిజిస్ట్రార్‌ (జుడీషియల్‌)ను ఆదేశించింది. నోటీసు అతనికి ఇచ్చిన తర్వాత పోలీసుల సాయంతో అతన్ని కోర్టు బయట విడిచిపెట్టాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ బుధవారం సాయంత్రం అతనికి నోటీసులు అందజేశారు.

అనంతరం పోలీసులు అతన్ని కోర్టు బయట విడిచిపెట్టారు. ఇటువంటి ప్రవర్తన పునరావృత్తం కాకూడదన్న ఉద్దేశంతో మూర్తిని అతని కేసు విచారణ ఉన్న రోజు తప్ప, మిగిలిన రోజుల్లో కోర్టు ప్రాంగణంలోకి అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో 61 న్యాయమూర్తులకు గానూ కేవలం 33 మందే ఉన్నారు. ఇటీవల ఆరుగురు న్యాయమూర్తుల నియామకం జరగడంతో ఈ సంఖ్య 33కు చేరింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement