నల్లమల వీరుడు ఈ బాలుడు | Sakshi
Sakshi News home page

నల్లమల వీరుడు ఈ బాలుడు

Published Thu, Oct 5 2017 5:07 PM

nallamala honey boy

సాక్షి, అప్పాపూర్‌ : ప్రకృతి ఓ అద్భుతం.. అందులోకి అడుగుపెట్టాలేగానీ మనసు గాల్లో తేలుతుంది. ఎంతపెద్దవాళ్లయినా పసిపిల్లల మాదిరిగా మారిపోతారు.. ఆ కాసేపు కష్టాలు కనుమరుగువుతాయి.. ప్రతి చెట్టూ ప్రతి పుట్టా ప్రతి పువ్వు, పక్షులు ఇలా ఒక్కటేమిటి ప్రతి అణువూ పలకరిస్తుంది. దాంతో ఒళ్లు పులకరిస్తుంది. నాగరికత పేరుతో నగరాల్లో బతికేవారికి భౌతిక సుఖాలుంటేయేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం మానసిక ఆనందం టన్నుల్లో ఉంటుంది. భౌతిక నగరంలో ఉన్నోళ్లు డబ్బుతో, అధికారంతో, పదవులతో ధైర్యాన్ని అరవు తెచ్చుకుంటారేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం ఇది వారితోపాటే సహజంగా పెరిగి పెద్దదవుతుంది. చిన్నచీమను చూస్తే అమ్మో అని గోల చేస్తారు నేటి నగర పిల్లలు.. కానీ, ప్రకృతిలో ఉండే పిల్లలు మాత్రం దేన్ని లెక్కచేయరు.. సాహసం అనేది వారికి రోజువారి క్రీడ. తేనేటీగల సంగతి తెలిసే ఉంటుందిగా.. అవి కుడితే కందిపోవాల్సిందే.. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది.

అలాంటి తేనే తుట్టెను రాలగొట్టడం ఈ ప్రకృతితో మమేకమై జీవించే పిల్లలకు పెద్ద కష్టమేమీ కాదు.. అదే విషయాన్ని రుజువు చేస్తూ ఓ పిల్లాడు తన పొడవు ఉన్న తేనెతుట్టెను సునాయాసంగా తెంపేసి చక్కగా ఫొటోకి ఫోజుచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా తేనేను చూస్తే నోరు ఊరిపోతుంటుంది. అలాంటిది తన పొడవున్న తేనెతుట్టెను పట్టుకొని దర్జాగా నిల్చున్నాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అంబ్రాబాద్‌ మండలం పరిధిలోని నల్లమల్ల అడవుల్లో అప్పాపూర్‌ అనే ఓ మారుమూల చెంచు గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన సురేష్‌ (టింకు) అనే చెంచు బాలుడు తనపొడవైన తేనెతుట్టెను పట్టుకొని కనిపించాడు. ఇదెక్కడిదని ప్రశ్నించగా తానే తీసుకొచ్చానని, అందులోని తేనెను పిండుతున్నానని తెలిపాడు. తాను ఖాళీ సమయాల్లో ఇలాంటి సాహసాలు ఇంకెన్నో చేయగలనంటూ వివరించాడు. ఈ మాటలు విన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో చెంచు సాహిత్యంపై పరిశోధన చేస్తున్న క్రిష్ణ గోపాల్‌ అనే పరిశోధకుడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌ కెమెరాలో బందించి ఇలా పంచుకున్నారు.

Advertisement
Advertisement