మరో రెండు జిల్లాల ఏర్పాటుకు డిమాండ్‌

24 Jun, 2019 18:23 IST|Sakshi

వరంగల్‌ : పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా రాష్ట్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. తెలంగాణలో కొత్త జిల్లాల డిమాండ్‌ ఆగడం లేదు. తమ ప్రాంతాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఎక్కడో చోట నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా  వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సాక్షాత్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, తూర్పు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ డిమాండ్‌ను తెరపైకి తేవడం గమనార్హం. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు కొనసాగుతున్నాయి.

అంతేకాకుండా వరంగల్‌ జిల్లాను విభజించి.. జనగామ్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్‌ జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. అయితే, వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్‌’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలని, ఈ మేరకు రెండు జిల్లాల మార్పు అనివార్యమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తాజాగా ముఖ్యమంత్రికి  విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మొదట ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ.. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు