ఎడ్లబండే.. అంబులెన్సు.. | Sakshi
Sakshi News home page

ఎడ్లబండే.. అంబులెన్సు..

Published Thu, Jun 26 2014 3:19 AM

ఎడ్లబండే.. అంబులెన్సు.. - Sakshi

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాహనాల ఎత్తివేత
అత్యవసర వైద్యం అందని ద్రాక్షే..    
పునరుద్ధరించాలని గిరిజనుల వేడుకోలు

ఉట్నూర్ :ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా పదిహేనేళ్ల క్రితం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సేవలు అందిస్తున్న అంబులెన్సులకు సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో సేవలు నిలిచాయి.

అంబులెన్సులు కొనుగోలు చేసి చాలా ఏళ్లు కావడంతో కాలం చెల్లాయి. కొన్నింటికి విడిభాగాలు దొరకని పరిస్థితి. గత అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వైద్యశాఖ మినిట్స్ అఫ్ ది మీటింగ్‌లో ఏజెన్సీ పీహెచ్‌సీల అంశం ప్రస్తావనకు వచ్చింది. సాధ్యాసాధ్యాలను చర్చించిన యంత్రాంగంఅంబులెన్స్‌లను ఎత్తివేయాలని నిర్ణయించారు. దీం తో జనవరి నుంచి ఇచ్చోడ, దండేపల్లి, బజార్‌హత్ను ర్, నర్సాపూర్(టి), నేరడిగొండ, గుడిహత్నూర్, భీం పూర్, నార్నూర్, వాంకిడి, దంతన్‌పల్లి, ఝర్రి, పిట్టబొంగరం పీహెచ్‌సీల అంబులెన్సులు ఎత్తివేశారు.
 
అద్దె అంబులెన్సులకు రూ.80 లక్షలు విడుదలైనా..
అంబులెన్సు సేవలను నిలిపివేసిన వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో వ్యాధుల తీవ్రత అంతగా ఉండని మందమర్రి, లోన్‌వెల్లి, ఈజ్‌గాం పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అద్దె ప్రతిపాదికన ఏడాది పాటు అంబులెన్సులు సమకుర్చుకోవాలని రూ.80 లక్షలు విడుదల చేసింది. ఏజెన్సీలో ప్రసవ సమయంలో గర్భవతులను ఆరోగ్య కేంద్రాలకు, ఇళ్లకు తరలించడానికి ఐటీడీఏ ఐఏపీ ద్వారా కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సులను ఉపయోగిస్తుంది.

వీటి నిర్వహణకు విడుదలైన రూ.80 లక్షల నిధులు ఖర్చు చేస్తుండటంతో ఐటీడీఏ పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పీహెచ్‌సీలకు అంబులెన్సులు లేక పోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అంబులెన్సు వాహన సౌకర్యం లేక పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు వసతి గృహల పర్యటన, అత్యవసర వైద్య శిబిరాల ఏర్పాటు, బీసీడీఎస్ నుంచి పీహెచ్‌సీలకు మందుల రవాణా తదితర పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.

వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పిస్తే అత్యవసర సమయంలో గిరిజనుల ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.
 తొమ్మిది పీహెచ్‌సీలకే అంబులెన్సులు
 ప్రతి ఏడాది వ్యాధుల సీజన్‌లో ఐటీడీఏ దాదాపు 24 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పించి మిగతా పీహెచ్‌సీలను అంబులెన్సు ఉన్న కేంద్రాలకు అనుసంధానం చేసి గిరిజనులకు అత్యవసర వైద్యం అందిస్తోంది. పీహెచ్‌సీలకు అంబులెన్సులు ఎత్తివేయడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏజెన్సీలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు చెందిన మూడు అంబులెన్సులు జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి పీహెచ్‌సీల్లో ఉన్నాయి.

అదికాక 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐఏపీ పథకంలో భాగంగా రూ.60 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సుల్లో కాసిపేట, అంకోళి, గిన్నెధరి పీహెచ్‌సీలకు మూడు, ఆస్రా హెచ్‌ఎమ్‌ఆర్‌ఐ అనే సంస్థ అధినంలోని ఇంద్రవెల్లి, తిర్యాణి పీహెచ్‌సీలకు రెండు అంబులెన్సులు, మరొక్కటి హెల్త్ సెల్ నిర్వహణకు వాంకిడి పీహెచ్‌సీలో ఉంది.
 
ఇలా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో తొమ్మిదింటికే ఇతర పథకాల ద్వారా వచ్చిన అంబులెన్సులు మినహా అంబులెన్సులు లేక పోవడంతో గిరిజనుల పాలిట శాపంగా మారుతుంది. అంబులెన్సు సౌకర్యాలు లేక పరిస్థితి విషమిస్తే ఎడ్లబండ్లే దిక్కు అవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. సీజన్ మొదలు కావడంతో ఐటీడీఏ విడుదల చేసిన నిధులతో ప్రతి పీహెచ్‌సీకి అద్దె అంబులెన్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
 చర్యలు తీసుకుంటున్నాం..
 - ప్రభాకర్‌రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి
 
జనవరి నుంచి పీహెచ్‌సీలకు అంబులెన్సులు తొలగించబడ్డాయి. అద్దె అంబులెన్సుల కోసం వైద్యశాఖ రూ.80 లక్షలు నిధులు కేటాయించింది. గర్భిణీ, బాలింతల మరణాల నివారణకు కేటాయించిన అంబులెన్సుల ఖర్చులకు నిధులు ఉపయోగిస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సుల సౌకర్యం కల్పించడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement