నవ తెలంగాణే.. | Sakshi
Sakshi News home page

నవ తెలంగాణే..

Published Sat, Dec 27 2014 1:19 AM

నవ తెలంగాణే..

నేటినుంచి సూర్యాపేటలో జిల్లా మహాసభలు
కొత్త కమిటీ ఎన్నికతోపాటు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన
‘సామాజిక’ కోణంలో ముందుకెళ్లే యోచనలో పార్టీ నాయకత్వం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా మహాసభలకు తొలిసారిగా సూర్యాపేట వేదిక కాబోతోంది. ఈనెల 27,28,29 తేదీల్లో మూడురోజులపాటు జరగనున్న  ఈ మహాసభల్లో ఎప్పటిలాగే పార్టీ నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోనున్నారు. అయితే, సీపీఎం పార్టీకి మొదటి నుంచీ బలమైన కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన నష్టాలను పూడ్చుకుని,  పార్టీ పునర్‌వైభవం కోసం ప్రయత్నం చేసే దిశలో జరగనున్న ఈ మహాసభలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

తెలంగాణ వద్దన్న పార్టీగా,  మళ్లీ రాష్ట్రంలో ఎలా బలపడాలన్న యోచనలో పార్టీ జిల్లా కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా సామాజిక అంశాలే ప్రాతిపదికగా, అట్టడుగు వర్గాల ప్రయోజనం కోసం పనిచేయడం ద్వారా పార్టీని మళ్లీ బలోపేతం చేయాలన్న యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సైద్ధాంతిక నిర్మాణంపై కూడా ఈ మహాసభల్లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
 
నై తెలంగాణ టు నవ తెలంగాణ
వాస్తవానికి సీపీఎం జాతీయ దక్పథం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ప్రకటించింది. అంతకుముందు పార్టీలోని అంతర్గత పరిణామాలతో పాటు ప్రత్యేక రాష్ట్రఆకాంక్షకు వ్యతిరేకంగా పార్టీ వెళ్లిందనే కారణంతో జిల్లాలో చాలామంది ఆపార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా తెలంగాణవాదులు, మేధావులపరంగా కూడా నష్టపోయింది. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా దెబ్బతింది. అప్పటివరకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేస్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సెంటిమెంట్‌తో నిమిత్తం లేకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలని, నవతెలంగాణ నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో జిల్లాపార్టీ నాయకత్వం ఉంది.

ఇందుకోసం ‘సామాజిక’ అంశాలను ఎజెండాగా చేసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలతో పాటు కులవృత్తులు, ట్రేడ్‌యూనియన్ సమస్యలు (అసంఘటిత రంగాలకు చెందిన వారిని కలుపుకుని) తీసుకుని పోరాటాలు చేయాలని ఆలోచిస్తోంది. ఆ దిశలో జిల్లా మహాసభల్లో చర్చలు జరుపుతామని, పూర్తిస్థాయి పోరాట కార్యక్రమాలను తీసుకోవడం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళతామని ఆ పార్టీ నేతలంటున్నారు. మరోవైపు పార్టీపరంగా సైద్ధాంతిక పునాదులను మరింత బలపర్చుకునే దిశలో వారంలో ఒకరోజు డివి జన్‌స్థాయిలో పార్టీ నాయకత్వానికి స్టడీసర్కిళ్లు కూడా ఏర్పాటు చేయాలని మార్క్సిస్టులు నిర్ణయించారు.

ఈ మేరకు పార్టీ మహాసభల్లో ప్రతినిధులు చర్చించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నారు. అదేవిధంగా సంస్థాగత నిర్మాణం కోసం పార్టీ క్షేత్రస్థాయి మహాసభలను కూడా ఆ పార్టీ అందిపుచ్చుకుంది. జిల్లావ్యాప్తంగా అన్ని డివిజన్లు, మండలాలు, పట్టణాల మహాసభలను పూర్తి చేసుకుని ఇప్పుడు జిల్లా మహాసభలకు సిద్ధమవుతోంది. జిల్లా మహాసభల్లో భాగంగా మునుగోడు, మిర్యాల గూడ, తుంగతుర్తి డివిజన్ కార్యదర్శులను మార్చి కొత్తనాయకత్వానికి అవకాశం ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement