నవల్గాలో మద్యం నిషేధం! | Sakshi
Sakshi News home page

నవల్గాలో మద్యం నిషేధం!

Published Thu, Jun 27 2019 12:33 PM

Navalga Panchayat Decides For  Liquor Ban In Sangareddy District - Sakshi

సాక్షి, బషీరాబాద్‌(సంగారెడ్డి): యువతను పెడదారి పట్టిస్తున్న మద్యంను కట్టడి చేయడానికి బషీరాబాద్‌ మండలం నవల్గా గ్రామ పంచాయతీ నడుం బిగించింది.  గ్రామంలో నడుపుతున్న బెల్టు షాపుల భరతం పట్టాలని నిర్ణయించింది. దీని కోసం సర్పంచ్‌ డి. నర్సింహులు బుధవారం పంచాయతీ కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై ఒకటి నుంచి గ్రామంలోని మద్యపానం నిషేధిస్తూ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ఇకపై బెల్టు షాపులన్నీ మూసి వేయాలని నోటీసులు జారీకి రంగం సిద్ధం చేశారు. జులై ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందున ఇకపై బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని  ఆబ్కారీ శాఖ అధికారులకు సర్పంచ్‌ లేఖ రాశారు. 

బషీరాబాద్‌ మండలం నవల్గా మేజర్‌ గ్రామ పంచాయతీ. ఇక్కడ యువత, కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే సాయంత్రం అయితే చాలు మద్యం ప్రియులు మద్యం తాగి రోడ్లమీద హల్‌చల్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో తరుచూ గొడవలు జరుగుతుండటమే కాకుండా న్యూసెన్స్‌ చేస్తున్నారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్‌ పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. అయితే  గ్రామంలో జరుగుతున్న గొడవలకు ప్రధాన కారణం బెల్టు షాపులని భావించిన సర్పంచ్‌  డి.నర్సింహులు మద్యం బంద్‌ చేస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని  సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే నెల ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తూ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల వలన  యువత పెడదారి పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారన్నారు. అలాగే గని కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసై కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

గ్రామంలో బెల్టు షాపులు పూర్తిగా బంద్‌ చేయాలని  ఆబ్కారీ శాఖ అధికారులకు కూ డా లేఖ రాసినట్లు సర్పంచ్‌ వెల్లడించారు. లేఖ  మరోవైపు సర్పంచ్‌ తీసుకున్న నిర్ణయాన్ని  గ్రామంలోని మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు స్వాగతించారు. సర్పంచ్‌ తీసుకున్న నిర్ణయానికి ఆయన్ని అభినందనలు తెలిపారు.. అలాగే గ్రామంలో స్వచ్ఛతపై కూడగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సర్పంచ్‌ చెప్పా రు.

కార్యక్రమంలో ఎంపీటీసీ బాలక్రిష్ణ,  ఉప సర్పంచ్‌ మాల లాలప్ప, కార్యదర్శి లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్, మహేష్, వార్డు సభ్యులు సిద్దయ్య, ఆనంద్, మొగులమ్మ, పార్వతమ్మ, మొగులమ్మ, రాములమ్మ, లక్ష్మీ, అంగన్‌వాడీ టీచరు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement