వారి బాధను చూస్తుంటే అన్నమే సయించలేదు | Sakshi
Sakshi News home page

వారి బాధను చూస్తుంటే అన్నమే సయించలేదు

Published Wed, Jun 18 2014 1:10 AM

వారి బాధను చూస్తుంటే అన్నమే సయించలేదు - Sakshi

హిమాచల్ దుర్ఘటనపై నాయిని ఆవేదన
విద్యార్థుల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం
ఒక తండ్రిగా ఆ వేదనను భరించలేకపోయిన
కనీసం శవాలైనా దొరకాలనితిండీనిద్ర లేకుండా పనిచేసినం..
బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామన్న హోంమంత్రి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘అంతటి క్షోభ పగవారికి కూడా రావొద్దు. ఒకట్రెండేళ్లు పోతే అండగా ఉంటారనుకున్న పిల్లలు కనబడకుండా పోయిరి. ప్రాణం పోవడమే తట్టుకోలేనంత పెద్ద శిక్ష అయితే కనీసం శవమైనా దొరకలేదు. ఆ తల్లిదండ్రులను చూస్తుంటే హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న వారం రోజులు అన్నమే సయించలేదు’’ అని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. బియూస్ దుర్ఘటనలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్లిన నాయిని 8 రోజుల పాటు అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజాగా తన అనుభవాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 తొలి కార్యక్రమమే విషాదంతో...
 
 మొదటి కేబినెట్ జరుగుతున్నప్పుడే ఈ దుర్వార్త తెలిసింది. వెంటనే హిమాచల్‌ప్రదేశ్ సీఎంతో మన సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇక్కడి నుంచి ప్రభుత్వం తరఫున వెళ్లాలని, విద్యార్థులను ప్రాణాలతో కాపాడాలని ఆదేశించారు. ఆ రాత్రి వీలుకాకపోవడంతో ఉదయమే సంఘటనా స్థలానికి చేరినం. వారం రోజులు గాలిస్తే మొత్తం 8 శవాలు మాత్రమే దొరికినయి. మొత్తం ఆరు కిలోమీటర్ల పరిధిలో అన్ని ప్రాంతాల నుండి 700 మంది గజ ఈతగాళ్లు, రెండు సోనార్లు (వాటర్ స్కానర్లు), నదిలోని రాళ్లురప్పలన్నీ వెతికినా అంతకన్నా ప్రయోజనం కలగలేదు. రాష్ట్ర హోంమంత్రి హోదాలో తొలిసారే ఇంతటి విషాద కార్యక్రమానికి వెళ్లాల్సి రావడం దురదృష్టకరం.
 
 15-20 రోజులు ఆగాలన్నారు..
 
 నదిలో కొట్టుకుపోయినవారి కుటుంబీకుల క్షోభను ఒక తండ్రిగా తట్టుకోలేకపోయిన. కొడుకును పోగొట్టుకుంటే తండ్రి బాధ ఏమిటో నాకు తెలుసు. ఆచూకీ లేనివారంతా చనిపోయినట్టేనని అర్థం అయితనే ఉంది. కనీసం అంతిమ సంస్కారాలు చేయడానికి భౌతికకాయమైనా దొరికితే బాగుండునని తిండి, నిద్ర లేకుండా పనిచేసిన. అంత బాధలోనూ తల్లిదండ్రులూ అర్థం చేసుకున్నరు. మొత్తం డ్యాంలోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు, ప్రభుత్వంతో మాట్లాడినం. కానీ ప్రవాహంలో శవాల కాళ్లు, చేతులు, శరీర భాగాలన్నీ చిద్రం అయిపోతయని అన్నారు.  నీళ్లు 8 డిగ్రీలతో చల్లగా ఉన్నయి. నీటి లోపలి బురద, ఇసుకలో సగం కూరుకుపోయిన శవాలు తేలాలంటే 15-20 రోజులు ఆగాల్సి ఉంటుందన్నారు. కొంతకాలం ఆగుదామని తల్లిదండ్రులు అనడంతో ఆగినం. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటయి.
 
 ఎవరిది బాధ్యత...?
 
 హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిన 48 మందిలో ముగ్గురే ఫ్యాకల్టీలు. ఘటన జరిగిన రోజు అక్కడ సాయంత్రం 6.15కు 50 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే 7.15కు 150 క్యూసెక్కులు ఉంది. ఒకేసారి మూడు రెట్ల నీళ్లు వదిలారు. ఇలా ఎందుకు వదిలారంటే సమాధానం లేదు. స్థానిక పరిస్థితులు తెలిసిన గైడ్‌ను వెంట తీసుకుపోలేదు. పారిశ్రామిక యాత్రలో ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇవన్నీ కాలేజీ తరపున తప్పులు. హెచ్చరికలు, సైరన్లు లేకుండా నీళ్లు వదలడం అక్కడివారి తప్పు. వీటిపై సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్‌కు అందిస్తం.
 
 అందరినీ ఆదుకుంటం
 
 గతంలో అదే నదిలో ఒక మహిళా ఎమ్మెల్యే వెళ్తున్న కారు కొట్టుకుపోతే ఇప్పటిదాకా శవాలు దొరకలేదు. ఒక లారీ కూడా కొట్టుకుపోయినా పత్తా లేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అక్కడివారు విస్తుపోతున్నరు. ఇంత తీవ్రంగా ప్రభుత్వం కష్టపడుతున్నదని అక్కడి మీడియా, ప్రజలు అంటున్నరు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో చివరికి మృతదేహం కనుక్కుంటే రూ.10 వేలు ఇస్తామని చాటింపు వేయించినం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, కాలేజీకి కట్టిన ఫీజు వాపసు, బ్యాంకు రుణం తీసుకుంటే కాలేజీ యాజమాన్యమే చెల్లించే విధంగా, ఆ కుటుంబంలో విద్యార్థులుంటే ఉచిత ప్రవేశం, ఆ కాలేజీలో చేస్తామంటే ఒకరికి ఉద్యోగం వంటివి ఇస్తామన్నరు. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి చర్యలన్నీ తీసుకుంటం.
 
 ఆంధ్రా మంత్రులకు విహార యాత్రా?
 
 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన రాజప్ప, మరో మంత్రి, ఒక ఎంపీ విహార యాత్రలా ఉదయం వచ్చి సాయంత్రం పోయినరు. తెలంగాణ ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదనేనా వారి ఫీలింగ్. మేం క్రెడిట్ గురించి ఆలోచించలేదు. మానవత్వంతో స్పందించాం. అయినా ఇలాంటి విషయాల్లోనూ ఆంధ్ర-తెలంగాణ ఫీలింగ్ తీసుకురావడం దారుణం. తెలంగాణను బాగుచేస్తానంటున్న చంద్రబాబు బాగుపడుతడేమో. తెలంగాణ-ఆంధ్ర ఫీలింగ్ తేవద్దు. చంద్రబాబుకు ప్రచారపై యావ తప్ప బాధితులను ఆదుకోవాలని లేదు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement