ఎమ్మెల్సీ స్థానంపై నజర్ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ స్థానంపై నజర్

Published Sun, Jul 5 2015 1:01 AM

Nazar

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు పోటా పోటీగా బరిలో దిగి తమ సత్తా తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు జిల్లాకు ఒకే ఎమ్మెల్సీ స్థానం ఉంది.
 
 ఇప్పుడు మరో ఎమ్మెల్సీ స్థానం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ పార్టీల్లో ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న వారి సంఖ్య చేంతాడును తలపిస్తోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. గతంలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటాలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన జగదీశ్వర్‌రెడ్డికి మరోసారి అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.
 
 రెండో స్థానానికి ఎవరిని ఖరారు చేస్తారనే అంశం పార్టీ జిల్లా స్థాయి నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు రెండు స్థానాల్లో ఒంటరిగా పోటిచేసి గెలుపొందడం సాధ్యమవుతుందా లేదా మరో రాజకీయ పార్టీతో అవగాహనకు రావడం మెరుగ్గా ఉంటుందా అన్న అంశంపై అధికార పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రెండో స్థానానికి పోటీచేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న చర్చ పార్టీ అంతరంగికులతో ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు.
 
 మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మైనార్టీల ప్రాధాన్యం అత్యధికంగా ఉండడం.. గతంలో మైనార్టీలకు పార్టీపరంగా అవకాశాలు కల్పిస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రెండో స్థానానికి మైనార్టీ అభ్యర్థి పేరు పరిశీలించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో మైనార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా అతి తక్కువగా ఉండడం.. జిల్లాలో మైనార్టీల సంఖ్య సమృద్ధిగా ఉండడం వంటి కారణాలతో జిల్లా నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కల్వకుర్తికి చెందిన బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, గద్వాలకు చెందిన కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి తీవ్రపోటీ నెలకొంది. జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు మల్లురవి, విఠల్‌రావు, జిల్లా సీనియర్ నేత డీకే భరతసింహారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీమంత్రి శంకర్‌రావు తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే మూడు ప్రధాన రాజకీయ పక్షాలు విడివిడిగా పోటీచేస్తే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితి నెలకొంది.
 
 కాంగ్రెస్‌తో ఈ ఎన్నికల్లో టీడీపీ ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతుండడంతో ఇందుకు ప్రత్యామ్నాయంగా టీఆర్‌ఎస్ రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. జిల్లా నుంచి టీడీపీకి ఎమ్మెల్సీగా అవకాశం రాకుండా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్ అవసరమైతే రెండో స్థానంలో అభ్యర్థిని నిలుపకుండా ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి కాంగ్రెస్ సహకారంతో చెరో సీటు గెలుపొందేలా చేస్తే ఎలా ఉంటుందన్న అంశం ఆ పార్టీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
 
 కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో బలంగా ఉన్నందున పరస్పరం సహకరించుకోవడం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాలని టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందుకు కాంగ్రెస్ నుంచి ఏ మేరకు సానుకూల స్పందన లభిస్తుంది.. అప్పుడు అభ్యర్థిగా ఎవరుంటారన్న అంశం కాంగ్రెస్‌లోనూ చర్చనీయాంశమైంది.
 
 జిల్లా కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మైనార్టీ నేతకు టీఆర్‌ఎస్ గాలం వేస్తున్నట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామనే ఆఫర్‌తో సదరు మైనార్టీ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సదరు నేతకు తొందరపడొద్దని అదే అవకాశం కాంగ్రెస్ నుంచి రావడానికి ఛాన్సుందని నచ్చచెబుతున్నట్లు సమాచారం.
 
  ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ సైతం భారీ ఆశలనే పెట్టుకుంది. తమ స్థానిక సంస్థల ప్రతినిధులను ఇతర పార్టీలు ఆకర్షించకుండా ఉండేందుకు ముందు నుంచే ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ తరఫున కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని రంగంలోకి దించడం దాదాపు ఖాయమైందని ప్రచారం. అయితే టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందన్న ప్రచారం.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వారి మైత్రి ప్రశ్నార్థకమే అన్న భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొననుంది.
 

Advertisement
Advertisement