ఎర్రంమంజిల్‌.. ఇక సెలవ్‌ | Sakshi
Sakshi News home page

ఎర్రంమంజిల్‌.. ఇక సెలవ్‌

Published Thu, Jun 27 2019 8:42 AM

New Assembly Construction in Errum Manzil - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: చారిత్రక భవంతి మరో చారిత్రక నిర్మాణానికి నిలయం కానుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఎర్రంమంజిల్‌ (ఇర్రంమంజిల్‌) ప్రాంతంలో నూతన అసెంబ్లీ, మండలి భవన నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, చారిత్రక ఆసక్తి ఉన్నవారు దీనిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఇది సరైన ప్రదేశమని అంటుండగా మరికొందరు పురాతన చరిత్ర ఆనవాళ్లు కోల్పోతామని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రంమంజిల్‌ విశిష్టతలపై ‘సాక్షి’ కథనం..

ఈ పేరెలా వచ్చింది..
‘ఇర్రంమంజిల్‌’ అనేది పర్షియన్‌ పదం. తెలుగులో ‘స్వర్గంలో నిర్మించిన అందాల భవనం’ అని అర్థం. ఒకప్పడు చుట్టూ పంట పొలాల మధ్య ఖైరతాబాద్‌– పంజగుట్ట మార్గంలోని చిన్న గుట్టపై ఇర్రం మంజిల్‌ నిర్మించారు. ఆరో నిజాంకు అత్యంత ప్రియమిత్రుడు, నిజాం హయాంలో పోలీసు, న్యాయశాఖల మంత్రి నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ బహదూర్‌ ఈ భవనాన్ని 1870లో నిర్మించారు. వాడుక భాషలో ఈ భవనం ఉన్న ప్రాంతం ఎర్రమంజిల్‌గా మారింది.

తీరైన వాస్తురీతి..
శతాబ్దాల క్రితమే ఈ భవనాన్ని 1.13 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో ఇండో–యూరోపియన్‌ చారిత్రక శైలిలో నిర్మించారు. ఇందుకు రూ.30 కోట్లు ఖర్చుచేశారు. అత్యంత విశాలమైన డ్రాయింగ్‌రూమ్‌ ఈ భవనంలో ఉంది. వివిధ కళాకృతులతో 150 గదులు ఈ భవనంలో ఉన్నాయి. భవన ప్రాంగణంలోనే పోలో, గోల్ఫ్‌ కోర్టులుండేవి. పాయిగా ప్రభువులు నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు దీటుగా ఇర్రంమంజిల్‌ను తీర్చిదిద్దారు. 1948 వరకు నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ సంబంధీకుల అధీనంలోనే ఈ భవనం ఉంది. ఆ తర్వాత 1956 వరకు పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌ ఈ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. అనంతరం ఈ పరిసరాలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. అయినప్పటికీ ఈ భవనం పరిసరాల్లో చాలా ఖాళీ ప్రదేశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ భవనంలోని మూడు గదులను ఏపీ ఆర్‌అండ్‌బీ విభాగానికి కేటాయించారు. దీనికి కూతవేటు దూరంలోనే ఐఅండ్‌సీఏడీకి చెందిన విశాల భవంతి ఉంది. జలసౌధగా పిలుస్తోన్న ఈ భవనం 2.2 లక్షల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ భవనం చుట్టూ సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌బెల్ట్‌ ఉంది. 

మారనున్న రూపురేఖలు..
ఖైరతాబాద్‌– పంజగుట్ట ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం చుట్టూ మూడు కాలనీలు, ఒకవైపు నిమ్స్, మరో వైపు మెట్రో మాల్‌కు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మించనున్నారు. పార్కింగ్, సాధారణ పౌరుల రాకపోకలు, వాహనాల రాకపోకల విషయంలో నియంత్రణలు శాపంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ చారిత్రక భవనం తొలగించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించిన తర్వాత నగరంలో మరో అతి పురాతన చారిత్రక భవనం కాలగర్భంలో కలిసిపోనుండడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

రూ.100 కోట్లతో..   
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఎర్రం మంజిల్‌లోని 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చట్టసభలను ఠీవీగా నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నారు. పార్లమెంట్‌ను తలపించేలా సెంట్రల్‌ హాల్, శాసన సభ, శాసన మండలి ఉంటాయి.

బస్తీవాసుల్లో భయం..భయం..
ఎర్రంమంజిల్‌లో శాసనసభ, శాసన మండలి భవనాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి సమీప బస్తీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు బస్తీ నాయకులు సమావేశమై భవనాల నమూనా ఇంకా రాలేదని, స్థలాలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు సేకరిస్తారో ఇంకా వివరించకముందే ఉద్యమాలు చేయడం ఎందుకు? మన బస్తీలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లు తెలిస్తే మాత్రం పార్టీలు, జెండాలు పక్కనపెట్టి బస్తీలు రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడదామని తీర్మానించారు. ఎవరి స్థాయిలో వారు సెక్రటేరియట్‌లో, ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో స్థలం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సేకరిస్తున్నారు? తమ బస్తీలకు ఏమైనా ప్రమాదం ఉందా? అనే విషయాలమై ఆరా తీస్తున్నారు. కానీ సరైన సమాచారం ఎవరి వద్దా లేదని తెలిసింది. అసెంబ్లీ, శాసనమండలి భవనాలు వస్తే ఈ ప్రాంతం మొత్తం హై సెక్యురిటీ జోన్‌ కిందకు వెళ్తుందని తప్పకుండా బస్తీలు తొలగించాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామకృష్ణానగర్, తబేళా బస్తీలకు ప్రమాదం ఉందని బస్తీవాసులు అంటున్నారు.

సుమారు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న బస్తీలో 300 కుటుంబాల వరకు ఉన్నాయి. ఇంతమందిని రోడ్డుపాలు చేసే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోరని భావిస్తున్నాం. ఒకవేళ మా బస్తీకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందంటే మాత్రం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం. తప్పకుండా మా బస్తీని కాపాడుకుంటాం.       – టి.వి.రమణ, రామకృష్ణానగ

విడిచి వెళ్లేది లేదు.. 
మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు శాసనసభ, శాసన మండలి వస్తుంది. హై సెక్యురిటీ జోన్‌ పరిధిలోకి వస్తుందని వెళ్లిపొమ్మంటే సహించేది లేదు. మాకు ఎలాంటి నష్టపరిహారం, వేరే చోట ఇళ్లు ఇస్తామన్నా ఒప్పుకునేది లేదు. ఇక్కడ నుండి కదిలేది లేదు. మా బస్తీలను ఎలా కాపాడుకోవాలో తెలుసు.   – మురళి, రామకృష్ణానగర్‌

ఆ ఆలోచన విరమించుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక కట్టడమైన ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ హైదరాబాద్‌ సొత్తని, కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసమంటూ దాన్ని కూల్చి వేయాలనే ఆలోచన విరమించుకోవాలని నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తాము సీఎంను కలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే ఆ అవకాశం చిక్కట్లేదని పేర్కొన్నారు. రెడ్‌హిల్స్‌లోని అలీ విల్లాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ లీగల్‌ హెయిర్స్‌ అసోసియేషన్‌’ ప్రతినిధులు మాట్లాడారు. అసోసియేషన్‌ కార్యదర్శి నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ... ‘సేవ్‌ ఎర్రమంజిల్‌ అంటూ ఓ కుటుంబం మొదలెట్టిన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతోంది. కేవలం హైదరాబాద్‌లోని వారే కాకుండా అమెరికా, కెనడా దేశాల్లోని వాళ్లూ ఈ నినాదానికి మద్దతు పలుకుతున్నారు. నిజాం హయాంలో మంత్రిగా పని చేసిన ఫక్రుల్‌ ముల్క్‌ తన భవనాల్లో ఒకదాన్ని నిజాం కాలేజీ కోసం దానం ఇచ్చారు. కేవలం కొత్త నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే పాతబస్తీలోని ఇంటిని వదిలి 1870లో ఎర్రమంజిల్‌ ప్రాంతానికి వచ్చారు. అక్కడున్న ఓ కొండపై ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ నిర్మించారు. 150 మంది ఒకేసారి భోజనం చేసే వీలున్న డైనింగ్‌ రూమ్‌తో పాటు అనేక హంగులతో కూడిన ఈ ప్యాలెస్‌ అప్పట్లో వైస్రాయ్, గవర్నర్‌ జనరల్స్‌లనూ ఆకట్టుకుంది.

వారసత్వం సంపద లాంటి దాన్ని కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించడం ఫక్రుల్‌ ముల్క్‌ వారసుల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. ఆ ప్యాలెస్‌ కూలే స్థితిలో ఉందంటూ వస్తున్న వార్తలు వదంతులు మాత్రమే. ఆ ప్యాలెస్‌ చుట్టూ ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ నిర్మించే అంశాన్ని సీఎం పరిశీలించాలి. ఎర్రమంజిల్‌ను పునరుద్ధరిస్తే రాష్ట్రానికి వచ్చే విదేశీ అతి«థులకు విడిదిగా వాడుకునే ఆస్కారం ఉంటుంది. 1934లో ఫక్రుల్‌ ముల్క్‌ కన్నుమూసిన తర్వాత ఆయన ఐదుగురు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం కోరడంతో రూ.15 లక్షల నామమాత్రపు ధరకు ప్యాలెస్‌తో పాటు చుట్టూ ఉన్న స్థలాన్ని విక్రయించారు. ప్రభుత్వ అధీనంలో ఉంటే ఎర్రమంజిల్‌ తన రూపుకోల్పోదని భావించిన ఫక్రుల్‌ ముల్క్‌ కుమారులు విక్రయ సమయంలో ఆ విషయం ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఎర్రమంజిల్‌ కూల్చివేత  భావ్యం కాదు. మేం ప్రభుత్వానికి విన్నవించడానికే తప్ప పోరాడటానికి సిద్ధంగా లేము. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన లేదు. వీలున్నంత వరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తాం. ఒకవేళ ఎర్రమంజిల్‌ను కూల్చాలనే ప్రభుత్వం భావిస్తే కొత్తగా నిర్మించే అసెంబ్లీని ప్రస్తుతం ఉన్న ప్యాలెస్‌ మోడల్‌లోనే కట్టి, ఎర్రమంజిల్‌ పేరునే కొనసాగించాలి. అందులో ఫక్రుల్‌ ముల్క్‌ విగ్రహం పెట్టి ఆయన చరిత్రతో రికార్డులు పొందుపరచాలి’ అని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement