‘నల్లవాగు’కు కొత్త కళ తెస్తాం | Sakshi
Sakshi News home page

‘నల్లవాగు’కు కొత్త కళ తెస్తాం

Published Tue, Sep 29 2015 12:11 AM

‘నల్లవాగు’కు కొత్త కళ తెస్తాం

- ప్రాజెక్టును ఆధునీకరిస్తాం
- చేపల పెంపకం కోసం ఖర్చుకు వెనకాడం
- జిల్లాలో రూ. 830 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు
- రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
కల్హేర్:
జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగును పూర్తిగా ఆధునీకరించి దాని స్థితిగతులను మారుస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో  నల్లవాగులో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.భూపాల్‌రెడ్డితో కలిసి చేప పిల్లలు వదిలారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామన్నారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించి 10 రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీని ఆదేశిస్తామని తెలిపారు. నల్లవాగు వృథా నీటిని డైవర్షన్ చేసి రైతులకు సాగు నీరందిస్తామని భరోసా ఇచ్చారు.
 
ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలు పెంచేందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు. చెరువుల అభివృద్ధి కోసం జిల్లాలో రూ.250 కోట్లు కేటాయించమని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో కొత్తగా చెరువులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలోని మెదక్, జోగిపేట, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ. 830 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి సరఫరా చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమైక్యాంధ్ర పాలన అవినీతి మయంగా సాగిందని ధ్వజమెత్తారు. గుడిసెలు లేకుండా చేసేందుకు డబుల్‌బెడ్‌రూంలు నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వాన్ని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, వీరశైవ లింగాయత్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బీడెకన్నె హన్మంత్,  జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు నర్సింలు, ఎంపీపీ జమునాబాయి, జెడ్పీటీసీ గుండు స్వప్నమోహన్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు రాంసింగ్, గుండు మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎంపీటీసీలు ప్రకాశ్, సంజీవరావు, సర్పంచ్ అనురాధ, నాయకులు అంజయ్య, సాయగౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement