ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ

Published Thu, Jun 11 2015 4:01 AM

ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అన్ని కళాశాలలకు సొంత భవనాలు, ల్యాబ్‌ల సౌకర్యం, ల్యాబ్ పరికరాల కొనుగోలుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం సచివాలయంలో పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.

ముందుగా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆ తరువాత బోధనా సిబ్బంది నియామకం చేపడుతామన్నారు.  25 కళాశాలలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.142.42 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. 19 పాలిటెక్నిక్ కాలేజీల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 19 కోట్లు ఇచ్చామని, ఇందులో 15 హాస్టళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. అలాగే వికారాబాద్‌లో రూ. 8 కోట్లతో పాలిటెక్నిక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.

రూ. 34 కోట్లతో 23 పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రారంభించిన 8 పాలిటెక్నిక్‌లలో బోధన సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. ఇదిలాఉండగా, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ఉచితంగా ప్రవేశాలు కల్పించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉప కడియం శ్రీహరి స్వయంగా ఈ అంశంపై పరిశీలన జరుపుతున్నారు.

Advertisement
Advertisement