కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రావాలి  | Sakshi
Sakshi News home page

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రావాలి 

Published Sun, Nov 12 2017 1:11 AM

New Panchayati Raj Act should come - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన జరగాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మారిన పరిస్థితులను బేరీజు వేసుకుని కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన, గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం అమల్లోఉన్న చట్టం తయారు చేసినప్పుడు గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై అనేక విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించారన్నారు. తదనంతర కాలంలో అనేక మార్పులు వచ్చాయని, గ్రామ పంచాయతీలకు కొన్ని బాధ్యతలు తొలిగాయని, మరికొన్ని బాధ్యతలు పెరిగాయని సీఎం అన్నారు. గతంలో మంచినీటి సరఫరా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని, ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటున్నదని సీఎం చెప్పారు. ప్రజావైద్యం, రహదారుల నిర్మాణం, చెరువుల నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర అంశాలు ఇప్పుడు ఆయా శాఖల పరిధిలోకి వెళ్లాయని చెప్పారు. పచ్చదనం అభివృద్ధి, పరిశుభ్రతను కాపాడటం, జనన–మరణ–వివాహ రిజి స్ట్రేషన్లు చేయడం, శ్మశాన వాటికల నిర్వహణ, డంప్‌ యార్డుల ఏర్పాటు, గ్రామ ప్రణాళికల తయారీ లాంటి కొత్త బాధ్యతలు వచ్చి చేరాయని సీఎం అన్నారు.  

ఆదాయ వనరుల్లోనూ వ్యత్యాసం  
గతంలో గ్రామ పంచాయతీలకు ఉన్న ఆదాయ వనరులకు, ఇప్పుడున్న మార్గాలకు వ్యత్యాసం ఉందని, దానికి అనుగుణంగా గ్రామ పంచాయితీలు చేయాల్సిన పనులుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రామ పంచాయతీలకు నిర్ధిష్టమైన విధులు–నిధులు–బాధ్యతలు అప్పగించాలని, పని చేసే పంచాయతీరాజ్‌ వ్యవస్థను తీసుకురావాలని, ఇందుకు అనుగుణంగా కొత్త చట్టం రూపకల్పన జరగాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు చెల్లప్ప, ఎంపీ వినోద్‌కుమార్, పంచాయతీ రాజ్‌ కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు పి.రామారావు, కె. సుధాకర్, రంగారెడ్డి డీపీఓ కె.పద్మజా రాణి, మెదక్‌ డీపీవో సురేశ్‌ మోహన్, పంచాయతీరాజ్‌ – గ్రామీణాభివృద్ధి సంస్థ కన్సల్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   

Advertisement
Advertisement