కొత్తకార్డులకు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ | Sakshi
Sakshi News home page

కొత్తకార్డులకు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ

Published Fri, Oct 10 2014 2:48 AM

కొత్తకార్డులకు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ - Sakshi

 నీలగిరి : కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లకు శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ టి.చిరంజీవులు చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రద్దుచేసిన రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులిస్తామని చెప్పారు. రేషన్‌కార్డులు, పింఛన్లకు గ్రామస్థాయిలో దరఖాస్తు చేసుకోవాలని, పథకాలకు ఎంపిక చేసిన వారి వివరాలను గ్రామ పంచాయతీల్లో నోటీస్‌బోర్డు మీద ప్రకటిస్తామన్నారు. ఈ అంశాలకు సం బంధించి ఎలాంటి సమస్య ఎదురైనా టోల్‌ఫ్రీ నంబర్ 18004251442కు ఫోన్ చేయాలన్నారు.
 
 ఈ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికో  ఫ్ల్లయింగ్ స్క్వాడ్‌ను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరిట కొత్త రేషన్‌కార్డులను కూడా నవంబర్‌లో ముద్రించి ఇస్తామన్నారు.   పెంచిన కొత్త పింఛన్లు కూడా నవంబర్ 1వ తేదీ నుంచే  లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకునే విద్యార్థులు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో  శుక్రవారం నుంచి  ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించిన పిదప అర్హులైన వారికి నవంబర్ 1 నుంచి కొత్త సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, అదనపు జేసీ వెంకట్రావ్, డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఏఓ రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement