పైరవీలకు చెక్‌!

7 May, 2019 02:28 IST|Sakshi

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు

అడ్డగోలు ఈసీ, సీసీల జారీకి అడ్డుకట్ట

ముందు స్పాట్‌ బుకింగ్‌ రిజిస్ట్రేషన్ల పూర్తి.. తర్వాతే మిగిలినవి

యాప్‌ ద్వారా ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చర్యలు

రూ.1000లోపు నగదు లావాదేవీలకు కూడా బ్రేక్‌ పడ్డట్టే

ఐజీ, సంయుక్త ఐజీ ఆధ్వర్యంలో మార్పులు 

శాఖ పనితీరు మెరుగుపరుస్తూనే పారదర్శకతకోసం ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న ఈ శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దళారులు, పైరవీకారుల ప్రభావం శాఖపై లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ విషయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. ఈసీల జారీ నుంచి నగదు రహిత లావాదేవీల అమలు వరకు జరుగుతున్న సమూల మార్పు లు శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. 

ఇక అంత వీజీ కాదు 
గతంలో ఫలానా భూములకు సంబంధించిన ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ (సీసీ)ల జారీ అడ్డగోలుగా జరిగేది. ఒక్క చలానా మీదనే పలు ఈసీలు, సీసీలు తీసుకునే వెసులుబాటుండేది. కానీ, ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావడం ద్వారా ఈ విధానానికి చెక్‌ పెట్టారు. ఈసీ లేదా సీసీ కావాలంటే చలానా నెంబర్‌ను ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేసిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్ల లాగిన్‌ ద్వారానే వీటిని జారీ చేస్తున్నారు. దీంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. దీనికితోడు డాక్యుమెంట్‌ రైటర్ల ప్రభావం  శాఖ పనితీరుపై పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రయ, విక్రయ లావాదేవీల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డాక్యుమెంట్ల స్కానింగ్‌ ప్రక్రియలో ఆటోమేటెడ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు డాక్యుమెం ట్లను మాత్రమే స్కానింగ్‌ వరుసలో ఉంచి వాటి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాతే మరో డాక్యుమెంట్‌కు అవకాశం లభించే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా డాక్యుమెంట్‌ రైట ర్లు, శాఖ సిబ్బంది తమ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లను వెనుకా ముందు చేసే ఆస్కారం లేకుండా పోయింది. దీనికి తోడు స్పాట్‌ బుకింగ్‌ ద్వారా వచ్చిన లావాదేవీలను బుకింగ్‌ కన్‌ఫర్మ్‌ అయిన రోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపే రిజిస్ట్రేషన్‌ చేయాలని, ఆ తర్వాతే మాన్యువల్‌గా వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీంతో దాదాపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా పోయింది.
 
వచ్చే నెల డబ్బులతో పనికాదు 
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ టి.చిరంజీవులు ఆదేశాలతో సంయుక్త ఐజీ వి.శ్రీనివాసులు పర్యవేక్షణలో మరో కీలక నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు. ఈ జూన్‌ మాసం నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యా లెట్‌ యాప్‌ను రూపొందించే పనిలో పడ్డారు. ఈ యాప్‌ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.1000లోపు విలువైన లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్‌ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జరగనుంది. మొత్తంమీద ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అమలవుతున్న సంస్కరణలు శాఖ పనితీరును మెరుగుపర్చడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటం గమనార్హం.

మార్పు ఇలా..

  • డాక్యుమెంట్ల స్కానింగ్‌లో అటోమేటెడ్‌ విధానంతో దళారులు, డాక్యుమెంటు రైటర్ల ప్రభావం లేకుండా మార్పులకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు.
  • జూన్‌ నుంచి పూర్తిగా నగదురహిత లావాదేవీలే నిర్వహిస్తారు. వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
  • సబ్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌ ద్వారా సేవలు అందిస్తుండటంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది.
మరిన్ని వార్తలు