‘టోల్’ తీసుడే..! | Sakshi
Sakshi News home page

‘టోల్’ తీసుడే..!

Published Fri, Apr 4 2014 12:11 AM

new toll prices implemented in april first week

తూప్రాన్, న్యూస్‌లైన్:  44వ జాతీయ రహదారిపై ప్రయాణమంటే ఇక ‘టోల్’వలుచుడే.. ఇప్పటికే వాహనదారులు టోల్‌గేట్ భారం పెరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నా, మరోమారు ధరలు పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తున్నాయి. మండలంలోని అల్లాపూర్ శివారులో టోల్‌గేట్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పటికే అధిక ధరలు వసూలు చేస్తుండటంతో పలుమార్లు టోల్‌గేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, విధ్వంసానికి సైతం పాల్పడిన ఘటనలున్నాయి. టోల్ రుసుం చెల్లించలేక కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

 ఐతే ఇటీవల ఆ దారులగుండా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం టోల్‌గేట్ మీదుగా 8 నుంచి 10 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారీ టోల్‌గేట్ ఆదాయం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. టోల్‌గేట్ ట్యాక్స్ అమలులో వచ్చిన కొత్త విధానాల ప్రకారం 5 నుంచి 10 శాతం రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసులు ‘న్యూస్‌లైన్’తో తెలిపారు.

 పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
 ప్రస్తుతం కారు, జీపు, వ్యాన్ టోల్‌గేట్ నుంచి వెళితే రూ. 110 వసూలు చేస్తుండగా తాజాగా దాన్ని రూ.120 పెంచారు. ఒకసారి వెళ్లి మళ్లీ రావడానికి రూ.170 చెల్లించాల్సి ఉండగా, రూ.180కి పెంచారు. లైట్ గూడ్స్ వెహికిల్ వెళ్లడానికి రూ. 180 నుంచి రూ.195కి పెంచారు. వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ. 270 ఉండగా రూ. 290 చేశారు. ట్రక్కు, బస్సులాంటివి వెళ్లడానికి రూ.380 నుంచి రూ.405, వెళ్లి, తిరిగిరావడానికి రూ.570 నుంచి రూ.610కు పెంచారు. కమర్షియల్ వాహనాలకు రూ.445 నుంచి తిరిగి రావడానికి రూ.665కు పెంచారు. ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్ లాంటి వాహనాలకు రూ. 595 నుంచి రూ.640కి, వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ.890 నుంచి రూ.955కి పెంచారు. భారీ వాహనాలు వెళ్లడానికి రూ.725 నుంచి రూ.775కి, మళ్లీ తిరిగి రావడానికి రూ.1,085 నుంచి 1,165కి పెంచారు.

Advertisement
Advertisement