ముహూర్తం నేడే.. | Sakshi
Sakshi News home page

ముహూర్తం నేడే..

Published Thu, Aug 2 2018 12:08 PM

New Village Panchayats To Start Functioning Today - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): పరిపాలనను ప్రజల దరికి చేర్చేందుకు ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా చూడడంతో పాటు ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇక పాత గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు బుధవారంతో ముగియగా.. వీటితో పాటు నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో సైతం ప్రత్యేక అధికారుల పాలన గురువారం నుంచి ప్రారంభమవుతుంది.

ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో అనువుగా గదుల నుంచి పాలన సాగించేందుకు ఏర్పాట్లు చేయగా.. అందుబాటులో లేని ప్రాంతాల్లో అద్దె భవనాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ యా భవనాల మరమ్మతు, రంగులు వేయడం పూర్తికాగా.. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించా రు. అలాగే, కొత్త గ్రామపంచాయతీల్లో ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఆయా పంచాయతీలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పండుగ వాతావరణం 
జిల్లాలో 265 కొత్త గ్రామపంచాయతీలు గురువారం నుంచి మనుగడలోకి రానున్నాయి. గ్రామపంచాయతీలుగా మార్చాలనే డిమాండ్‌ ఉన్నవే కాకుండా డిమాండ్‌ లేని చాలా గ్రామాలను సైతం పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. కాగా, పాత పంచాయతీల పరిధిలో ఇవి ఉండగా.. బుధవారంతో ఆయా పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో గురువారం నుంచి నూతన గ్రామపంచాయతీల్లో పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు పండుగ వాతావరణంలో కొత్త గ్రామపంచాయతీలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలనను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు.

265 కొత్త పంచాయతీలు... 
జిల్లాలో కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 468 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో కలుపుకుని జిల్లాలో ప్రస్తుతం వీటి సంఖ్య 721కి చేరింది. 500 జనాభా ఉండి సంబంధిత గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న నివాసిత ప్రాంతాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన ప్రతీ గిరిజన తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. కొత్త, పాత వాటిని కలుపుకుంటే జిల్లాలో 733 పంచాయతీలు ఉండగా.. ఇందులో 12 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. తద్వారా జిల్లాలో 721 పంచాయతీలు ఉన్నట్లయింది.
 
ప్రత్యేక అధికారుల పాలన 
జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి కొత్త, పాత గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. గ్రామపంచాయతీల స్థాయి ప్రకారం గెజిటెట్‌ అధికారులు, మండల స్థాయి అధికారులకు బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. ఇందులో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు ఈఓపీఆర్‌డీలు, సీడీపీఓ, ఐసీడీఎస్‌ సూపరింటెండెంట్లు ఉన్నారు. రెండు, మూడు గ్రామపంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి వాటికి ఒక మండల స్థాయి అధికారిని నియమించారు.  

Advertisement
Advertisement