ఇక కొత్త మండలాలు! | Sakshi
Sakshi News home page

ఇక కొత్త మండలాలు!

Published Wed, Jan 7 2015 4:31 AM

New zones in Khammam

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం :రాష్ట్రవిభజనతో ఏజెన్సీ ప్రాంతంలో పాలనాపరంగా ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ముంపు గ్రామాల్లో  కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని తెలంగాణకు కేటాయించడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం తెరపైకి వ చ్చింది. దీనికోసం జిల్లా అధికార యంత్రాంగం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 7 మండలాల్లో ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో నైసర్గిక స్వరూపం మారింది. భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లలో మిగిలిన గ్రామాలతో నూతన మండలాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపారు. పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలంలో భద్రాచలం మినహా అన్ని గ్రామాలు, బూర్గంపాడు మండలంలో 4 పంచాయతీలను ఆంధ్రలో విలీనం చేశారు. మిగిలిన 9 పంచాయతీలు   జిల్లాలో ఉన్నాయి. ఏపీకి పోగా మిగిలిన పంచాయతీలతో నూతన మండలాల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
 
 భద్రాచలం మండలం చేస్తారా?
 భద్రాచలం మండల పరిధిలో గతంలో 22 గ్రామ పంచాయతీల్లో 89,048 జనాభా ఉండేవారు. విభజనతో 21 పంచాయతీలలో 38,961 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం భద్రాచలం పంచాయతీ మాత్రమే మండలంలో మిగిలి ఉంది. ఇక్కడ 50,087 మంది జనాభా ఉన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న బూర్గంపాడు మండలంలో 9 పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. దీనిలో జనాభా 57,078 మంది ఉన్నారు. ఈ రెండు మండలాలను కలిపి భద్రాచలం కేంద్రంగా ఒకే మండలం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భద్రాచలానికి ఆనుకొని సారపాక గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని భద్రాచలం పంచాయతీతో కలిపి ఒక్క మండలంగా ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుంద నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సారపాక గ్రామం పినపాక నియోజకవర్గ పరిధిలో ఉంది. భద్రాచలం అసెంబ్లీ పరిధిలో భద్రాచలం పంచాయతీ ఉంది. వేరు వేరు అసెంబ్లీ నియోజకవ ర్గాలు కలపడం సాధ్యం కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
 కోర్టుకు వెళ్ళిన ఎంపీటీసీలు.....
 బూర్గంపాడు మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించాలని హైకోర్ట్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా మండల పరిషత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు పంపింది. కొత్త మండలాలు ఏర్పాటు చేయకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్‌లకు అధ్యక్షులు ఉంటే ఆయా ప్రాంతాల్లో వెనకబాటును గుర్తించి అభివృద్ధిచేసే దిశగా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దీనికితోడు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎంపీపీ పదవి దక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకెళ్లినట్లు తెలుస్తోంది.
 
 మండలాలు ఏర్పడితేనే ఎన్నికలు..
 భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న పంచాయతీలను రెండు లేదా ఒక మండలంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తేనే అక్కడ మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. విభజన నేపథ్యంలో స్ధానిక సంస్థల ఎన్నికలను కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో బహిష్కరించారు. భద్రాచలం మండల పరిషత్‌లో 21 పంచాయతీలు, బూర్గంపాడులో నాలుగు పంచాయతీలు ఆంధ్రలో కలవడంతో అక్కడ సైతం ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు నిర్వహించాలంటే నూతన మండలాల పరిధి ఏర్పాటు చేయడం అవశ్యం అని ఎన్నికల కమిషన్ సూచించింది. తాజాగా జిల్లా కలెక్టర్ మండలాల ఏర్పాటుకు ప్రభుత్వ నివేదిక పంపారు. నిర్ణయం వెలువడిన అనంతరం మండలాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది.
 
 మండలాలు ఏర్పాటు చేయాలంటున్న ఉద్యోగులు..
 భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో పలు పంచాయతీలు ఆంధ్రాలో విలీనం కావడంతో మండలాల స్వరూపం మారింది. ఆయా మండలాల పరిధిలో గ్రామాలను కలుపుతూ నూతన మండలాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. భద్రాచలం పంచాయతీలో 50వేలకు పైగా జనాభా ఉన్నారని భద్రాచలం పంచాయతీకి మరో పంచాయతీని అనుసంధానం చేసి మండలాన్ని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాలను కలపకుండా విడివిడిగా ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు అనువుగా ఉండటంతో పాటు పోస్టులు తగ్గకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement