నెలకు రూ.కోటి | Sakshi
Sakshi News home page

నెలకు రూ.కోటి

Published Fri, Feb 13 2015 3:41 AM

నెలకు రూ.కోటి - Sakshi

వాగుల్లో..
ఇసుక దొంగలు
అధికారమే పెట్టుబడిగా..
అధికారులే అండదండగా..
నేతలే మాఫియాగా..
వల్లభపూర్, చిక్లీ, గుంజిలిలో దందా

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ నేతలకు ఇసుక దందా కాసులు కురిపిస్తోంది. ఓ వైపు పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట ‘ఇసుక మాఫియా’ మంజీరను తోడేస్తుంటే.. మరోవైపు అధికారుల అండదండలతో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్మూరు నియోజకవర్గం లో సర్కారుకు రూపాయి చెల్లించకుండా వాగులను కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వాగులను తోడేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని జనం మొత్తుకుంటున్నారు.

అడపా దడపా కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ,పోలీసుశాఖల అధికారులు సిద్ధమైనా.. హైదరాబాద్ ఫోన్ల ద్వారా ఒత్తిడి చేస్తుండటంతో ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తుందని వారు అంటున్నారు. అయితే ఈ ఇసుక దందాకు పోలీసుశాఖకు చెందిన ఓ ‘నిలయం’ అధికారే కాపు కాస్తున్నట్లు జిల్లా కేంద్రం వరకు ఫిర్యాదులు వస్తుండటం చర్చనీయూంశమైంది.
 
రోజుకు రూ.3.50 లక్షలు
వాగులో ఇసుకే కదా అని వదిలేస్తే.. ఈ దందా ఏడాదిలో రూ.కోట్లకు చేరుతోంది. ఆర్మూరు నియోజకవర్గంలోని మాక్లూరు మండలానికి చెందిన మూడు వాగులు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ వాగుల్లో ఇసుక తోడేందుకు టెండర్లు లేవు. సర్కారుకు రాయల్టీ కట్టే ది లేదు. గుడులు, బడులకు చందాలు కూడా లేవు. కేవలం అధికారపార్టీ నేతలమన్న ఒకే ఒక కారణంతో కొందరు రెండు నెలలుగా వాగులను తోడేస్తున్నారు. రోజుకు మాక్లూరు మండలం నుంచి 50 నుంచి 75 వరకు టిప్పర్లలో ఇసుకను నందిపేట, నవీపేట, ఆర్మూరు, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

ఒక్క టిప్పర్ లోడు ఇసుకకు పరిస్థితులను బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతుండగా.. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రోజుకు ఇసుక వ్యాపారులు దండుకుంటున్నారు. నెలలో రూ. 1 కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇసుకదందా వెనుక ఉన్న కొందరు నేతలు జేబులో వేసుకుంటున్నారు. అంటే ఏడాదిలో రూ.12 కోట్ల నుంచి రూ.14.50 కోట్ల వరకు ఇసుకదందా ద్వారా అక్రమ ఆదాయం సమకూరుతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను సైతం లెక్కచేయడం లేదు. కీలక నేతల పేర్లు వాడుకుంటూ రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖల అధికారులపై ఒత్తిడి చేస్తుండటం ఇటీవల వివాదాస్పదంగా మారింది.
 
వాగుల్లో ఇసుక దొంగలు
మాక్లూరు మండలంలోని వల్లభపూర్, చిక్లీ, గుంజిలి వాగుల్లో ‘ఇసుక’ దొంగలు విజృంభిస్తున్నారు. వాస్తవంగా మంజీర నది చుట్టూ ‘పట్టాభూముల’లో ఇసుక మేటల తొలగింపు పేరిట పొందిన అనుమతులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏడు అనుమతులను రద్దుచేస్తూ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌టీఎంసీ ద్వారానే ఇసుక విక్రయాలు జరిపేందుకు భూగర్భ గనుల శాఖ అధికారి భాస్కర్‌రెడ్డి 8 రీచ్‌లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ తదతర ప్రాంతాల్లో ఇసుక ధరలు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు వారి అండదండలతో ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుంచి విచ్చల విడిగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఐదు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మైనింగ్ కార్యాలయంలో కూడ కొందరు ఫిర్యాదు చేశారు. చిక్లీ వాగు నుంచి చిక్లీ, చిక్లీ క్యాంపు ఇసుక వ్యాపారులు గ్రామాభివృద్ది పేరిట అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గుంజిలి వాగు నుంచి గుంజిలి గ్రామానికి చెందిన కొందరు అక్రమ ఇసుక దందా సాగిస్తుం డటం వివాదాస్పదం అవుతోంది. భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్న తరుణంలో నిబంధనలకు విరుద్ధంగా వాగులను తోడేస్తున్నా... నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement