ప్రత్యామ్నాయమేనా? | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమేనా?

Published Wed, Jul 23 2014 11:50 PM

ప్రత్యామ్నాయమేనా? - Sakshi

గజ్వేల్: కార్తెలు కరిగిపోతున్నా... వర్షాలు సక్రమంగా లేక జిల్లాలో సాగు సాగడం లేదు. దీంతో ఈ సారి  ప్రత్యామ్నాయ పంటల సాగు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరో వారంరోజుల్లో భారీ వర్షాలు రావొచ్చని, ఈలోగా విత్తనాలు వేసినా ప్రయోజనం ఉంటుందని చెబుతూనే... వ్యవసాయశాఖ ఎందుకైనా మంచిదని ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతోంది. కాలం కలిసోస్తుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
 
 జిల్లాలో 4.40 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ ఈసారి 5.2 లక్షల హెక్టార్లలో పంటల సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ వర్షాలు లేక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. జూన్, జూలై నెలల్లో మొత్తం 281 మి.మీల సాధారణ వర్షపాతానికి గానూ ఇప్పటి వరకు 122 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఫలితంగా పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంగా 2.57లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. పత్తికి సంబంధించి ఒక్కొక్క రైతు రెండు నుంచి మూడుసార్లు పంటను చెడగొట్టారు.
 
 పత్తి పంటల విత్తనాలు, పెట్టుబడుల రూపంలో జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్ల నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనగా రూ. కోట్లల్లో పంట నష్టం జరిగింది. ఇక జిల్లాలో గరిష్టంగా సాగయ్యే వరి ఈ సారి ఇంకా మడుల్లోనే ఉండిపోయింది. ప్రతి ఏటా సమారు లక్ష హెక్టార్లలో సాగయ్యే ఈ పంట ప్రస్తుతం 22 వేల పైచిలుకు హెక్టార్లకే పరిమితమైంది.
 
 భారీ వర్షాలకు అవకాశం ఉంది: హుక్యానాయక్
 వారం రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యా నాయక్ తెలిపారు. బుధవారం గజ్వేల్ వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలోపు వర్షాలు కురిసిన పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవచ్చని చెప్పారు.
 
 ఆగస్టు మొదటి వారం కూడా వర్షాలు రాకపోతే పొద్దుతిరుగుడు, ఆముదం, కూరగాయలు వంటి ఆరుతడి పంటల సాగు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 

Advertisement
Advertisement