పిల్లల ప్రాణం.. గాల్లో దీపం | Sakshi
Sakshi News home page

పిల్లల ప్రాణం.. గాల్లో దీపం

Published Sun, Sep 6 2015 11:16 PM

పిల్లల ప్రాణం.. గాల్లో దీపం - Sakshi

స్కూలు యాజమాన్యాల నిర్లక్ష్యం... అధికారుల కాసుల కక్కుర్తి... వెరసి బడి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో చిన్నారులను కుక్కేసి... వాటిని యథేచ్ఛగా రోడ్లపైకి వదిలేస్తున్న యాజమాన్యాలకు... పరీక్షించి సీజ్ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు ‘రైట్’ చెబుతున్నారు. ఒకటీ అర కాదు... జిల్లాలో 207 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఫిట్‌నెస్ లేకుండా తిరిగేస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.    
 
- ఫిట్‌నెస్ లేని 207 బడి బస్సులు
- తీరు మారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు
- నిద్రావస్థలో ఆర్‌టీఏ అధికారులు  

జిల్లాలో ఇప్పటికి 207 బడి బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయి. కళ్ల ముందే ఇన్ని బస్సులు రయ్యిన పోతున్నా... ఆర్టీఏ అధికారులకు మాత్రం కనిపంచడం లేదు పాపం. ఏదో ప్రమాదం జరిగినప్పుడు తనిఖీలంటూ హడావుడి చేసి... హెచ్చరికలు జారీ చేసి.. ఆ తరువాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వారికి పరిపాటిగా మారిపోయింది. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను పరిమితికి మించి కుక్కుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లతో పని కానిస్తున్నారు. పిల్లల భద్రత గురించి కానీ, వారి ప్రాణాల గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో ఇటు యాజమాన్యాలు కానీ, అటు అధికారులు కానీ లేకపోవడం బాధాకరం.
 
నిబంధనలకు పాతర...

ఈ ఏడాది జూన్ 12న ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలల బస్సులు 1050. నిబంధనల ప్రకారం అప్పటికి 670 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ పొందాయి. ప్రస్తుతం మొత్తం బస్సుల సంఖ్య 1123కు చేరింది. వీటిలో నేటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందినవి 916 మాత్రమే. మిగిలినవి నిబంధనలకు విరుద్ధంగా పిల్లలతో రోడ్డెక్కేస్తున్నాయి. ప్రమాణాలు లేని బస్సుల వల్ల గతంలో ఘోర ప్రమాదాలెన్నో జరిగినా... విలువైన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా... అధికారు తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది. వారికసలు ఎలాంటి పట్టింపూ లేకుండా పోయింది. ఇక యాజమాన్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొని 16 మంది చిన్నారులు బలయిన దుర్ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది.
 
ప్రమాదాలు జరుగుతున్నా...
స్కూళ్లు ప్రారంభమయిన మరుసటి రోజు నుంచే బస్సు ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. జూన్13న రేగోడ్ మండలంలోని మేడికుందలో సెయింట్ డాన్‌బాస్కో పాఠశాల రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తూ పిల్లలకు ఎలాంటి గాయాలూ కాలేదు. జూన్ 14న గజ్వేల్ పరిధిలోని సంగాపూర్ వద్ద కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు చక్రం ఊడింది. తృటిలో ప్రమాదం తప్పింది. ఫిట్‌నెస్ పొందిన మరుసటి రోజు టైరు ఊడిపోవడం గమనార్హం! ఈ ఘటన తరువాత ప్రస్తుతం పిట్‌నెస్ పొందిన 916 బ స్సుల్లో భద్రత పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొక్కుబడిగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదేమో. అధికారులు, యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement