అఫిలియేషన్లలో ‘అవినీతి’ లేదు | Sakshi
Sakshi News home page

అఫిలియేషన్లలో ‘అవినీతి’ లేదు

Published Thu, Aug 3 2017 1:24 AM

అఫిలియేషన్లలో ‘అవినీతి’ లేదు

ఆన్‌లైన్‌ ద్వారానే గుర్తింపు పొందే ఏర్పాట్లు చేశాం: ఇంటర్‌ బోర్డు
  బోర్డుకు వచ్చి ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు
  29 కార్పొరేట్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు..
అవన్నీ  నారాయణ, శ్రీచైతన్య కాలేజీలే
  వాటికి రూ. 1.62 కోట్ల జరిమానా విధించాం.. చెల్లిస్తేనే అఫిలియేషన్‌
ఆ కాలేజీల్లోని విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయిస్తాం


సాక్షి, హైదరాబాద్‌
జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. కాలేజీ యాజమాన్యాలు ఇంట ర్మీడియెట్‌ బోర్డుకు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకొని అనుబంధ గుర్తింపు పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు. బోర్డు కార్యాలయానికి వచ్చి ఎవరినీ కలవాల్సిన అవసరం లేదన్నారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1,600 వరకు ఉన్న ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటివరకు 1,205 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామని తెలిపారు. మిగతా కాలేజీలకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చామని, నిర్ణీత వ్యవధిలో లోపాలను సరిదిద్దుకుంటామని హామీ ఇస్తే అనుబంధ గుర్తింపు ఇస్తామన్నారు. 10లోగా అలా హామీ ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. ఫైర్‌ సేప్టీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, రేకుల షెడ్డుల్లో నడుస్తున్న 85 కాలేజీలకు మాత్రమే షరతులతో కూడిన అనుబంధ గుర్తింపు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారన్నారు. సేల్‌ లేదా అగ్రిమెంట్‌ డీడ్‌ లేని వాటికి, ఆర్‌అండ్‌డీ లేని వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆయన చెప్పలేదన్నారు.

ఈసారి ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగింది..
రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 29 కార్పొరేట్‌ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని అశోక్‌ వెల్లడించారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన 13 కాలేజీలు, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 16 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాయన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్‌లు లేకపోవడం, అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు కొనసాగించడం వంటి తప్పిదాలకు పాల్పడ్డాయన్నారు. విజిలెన్స్‌ విచారణలో ఇది బయటపడటంతో వారికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేగాకుండా నారాయణ విద్యా సంస్థకు చెందిన కాలేజీలకు రూ.62.72 లక్షలు, శ్రీచైతన్య కాలేజీలకు రూ.1.04 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు. ఆ జరిమానాను ఆ కాలేజీలు ఇంతవరకు చెల్లించలేదని, అందుకే వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, వాటిల్లో ప్రవేశాలకు లాగిన్‌ ఐడీ ఇవ్వలేదని వివరించారు. జరిమానా చెల్లిస్తేనే వాటికి అనుబంధ గుర్తింపు ఇస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 10లోగా ఆయా కాలేజీలు జరిమానా చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.

ఇప్పటికే ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అవసరమైతే ఆయా విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామన్నారు. ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగిందని, సంఖ్య 98 వేలు దాటిందని చెప్పారు. ఎన్‌రోల్‌మెంట్‌ 2014లో 60 వేలు ఉండగా.. 2015లో 80 వేలకు, 2016లో 92 వేలకు చేరిందన్నారు. ఈ ఏడాది మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్యతోపాటు అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. అలాగే ఈసారి ప్రథమ సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఫలితాల సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వచ్చేనెల నుంచి ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్‌ బోధన, వర్చువల్‌ తరగతుల నిర్వహణను చేపడతామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు కాలేజీల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement