ఉమ్మడి కౌన్సెలింగ్‌ వద్దు | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కౌన్సెలింగ్‌ వద్దు

Published Fri, Mar 17 2017 3:38 AM

ఉమ్మడి కౌన్సెలింగ్‌ వద్దు

సాక్షి, హైదరాబాద్‌: ‘నీట్‌’ర్యాంకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ తదితర మెడికల్‌ కాలేజీల్లోని పీజీ, యూజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్న నిర్ణయంపై రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నాయి. దీనివల్ల తమకు బోలెడంత నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) సహా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. పైగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ఇటీవల స్పష్టమైన ప్రకటన జారీ అయిన వెంటనే పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

వైద్య ఫీజుల పెంపునకు డిమాండ్‌
ఉమ్మడి కౌన్సెలింగ్‌ తప్పనిసరైతే పీజీ వైద్య ఫీజులను పెంచాలని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. మంత్రి లక్ష్మారెడ్డితో మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు బుధవారం సమావేశమై.. ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్‌పై చర్చ జరిపాయి. ఫీజుల పెంపునకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే గతేడాది 10 శాతం పెంచినందున ఈసారి అంతకుమించి పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నట్లు తెలిసింది.

 ప్రస్తుతం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా క్లినికల్‌ సీట్లకు రూ. 3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్‌ కోటా సీట్లకు రూ. 5.8 లక్షలు ఫీజులున్న సంగతి తెలిసిందే. అయితే డొనేషన్ల పేరుతో యాజమాన్యాలు పీజీ సీట్లకు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. ఒక్కోసారి రూ. 2 కోట్లు కూడా వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో దాదాపు 700 పీజీ వైద్య సీట్లున్నాయి.  

ఎన్‌ఆర్‌ఐ సీట్లకూ ఉమ్మడి కౌన్సెలింగే..
ఈసారి ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) కోటాలోని 15 శాతం ఎంబీబీఎస్‌ సీట్లకు కూడా ఉమ్మడి కౌన్సెలింగ్‌ వర్తిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతేడాది ఈ సీట్లను కూడా ‘నీట్‌’ర్యాంకుల ఆధారంగా ప్రైవేటు యాజమాన్యాలే కౌన్సెలింగ్‌ లేకుండా ఇష్టానుసారంగా భర్తీ చేసుకున్నాయి. అయితే ఈసారి నుంచి నీట్‌ ర్యాంకుల ఆధారంగా బీ కేటగిరీ సీట్లతో సమానంగా ఎన్‌ఆర్‌ఐ సీట్లనూ ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారానే వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సంబంధించి పీజీ, యూజీలకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement