ఉద్యోగుల వైద్యానికి పరిమితేమీ లేదు | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల వైద్యానికి పరిమితేమీ లేదు

Published Thu, Jun 8 2017 1:36 AM

ఉద్యోగుల వైద్యానికి పరిమితేమీ లేదు - Sakshi

వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
- జర్నలిస్టులకు కూడా వర్తింపు
- 1,899 రకాల వ్యాధులకు చికిత్స
- అత్యవసరమైతే ‘కార్పొరేట్‌’కూ వెళ్లొచ్చు
- దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రత్యేక వైద్యం
- సమగ్రంగా ప్యాకేజీల ప్రకటన
- రాష్ట్రవ్యాప్తంగా 14 వెల్‌నెస్‌ సెంటర్లు
- రూ. 34 కోట్లతో ఏర్పాటు, రూ. 91 కోట్లతో ఔషధాలు


సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబీకులకు నగదురహిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వం, ఆ వర్గాల కుటుంబాల వైద్యానికి అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితీ విధించలేదని పేర్కొంది. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడైనా ప్రత్యేక వైద్యం చేయించుకుంటామన్నా అనుమతిస్తామని, ఆ ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఉండగా జబ్బుకు గురై ఆసుపత్రిలో చేరినా ఆ వైద్య ఖర్చులనూ భరిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) అమలు మార్గదర్శకాలపై శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 14 కార్పొరేట్‌ ఆసుపత్రులు, మరో 200 ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎక్కడైనా నగదురహిత వైద్యం చేయించుకోవచ్చని తెలిపింది.

సాధారణ జబ్బులకు మాత్రం ప్రభుత్వం స్థాపించిన వెల్‌నెస్‌ కేంద్రాల్లో ఔట్‌ పేషెంట్లుగా చూపించుకోవచ్చు. అక్కడ వైద్యం లభించకపోతే వెల్‌నెస్‌ సెంటర్ల సిఫార్సు మేరకు ప్రైవేటు ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్లుగా చేరవచ్చు. అంతేకాదు... గుండె జబ్బులు, పక్షవాతం, ప్రమాదాలు, స్పృహ తప్పి పడిపోవడం, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో నేరుగా కార్పొరేట్‌ లేదా ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందవచ్చు. అయితే అలా చేరిన 48 గంటల్లోగా ఈజేహెచ్‌ఎస్‌ కార్యాలయానికి సమాచారమివ్వాలి. ఇక, వెల్‌నెస్‌ సెంటర్లలో ఔట్‌ పేషెంట్‌ వైద్యం అందిస్తారు. ప్రాథమిక పరీక్షలు, వైద్యం, ఉచిత మందులు అందజేస్తారు. ఈసీజీ, రక్త, దంత తదితర పరీక్షలు చేస్తారు. అక్కడ లేని పరీక్షలను నెట్‌వర్క్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో చేయిస్తారు. మొత్తం 1,899 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు.

అత్యవసర వైద్యం కోసం వస్తే తిరస్కరించొద్దు
అత్యవసర వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులను కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రులు తిరస్కరించొద్దని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వచ్చిన తక్షణం వైద్యం ప్రారంభించి 24 గంటల్లో ఈజేహెచ్‌కు సమాచారం ఇవ్వాలి. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో మధ్యమధ్య సమాచారమిస్తూ ఉండాలి. రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.7 లక్షలు, రూ.10 లక్షలు ఆపై... ఇలా అయిన ఖర్చు వివరాలను మధ్యమధ్యలో తెలపాలి. సాధారణ వైద్యానికి సంబంధించి రూ.50 వేలదాకా ఎలాంటి సమాచారమూ ఇవ్వకున్నా ఫర్వాలేదు. సంబంధిత ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సిబ్బంది రోగుల నమోదు, డిశ్చార్జికి అవసరమైన సాయం చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే 24 నుంచి 48 గంటల్లోగా సమాచారమివ్వాలి.

14 వెల్‌నెస్‌ కేంద్రాలు
ఓపీ సేవల కోసం ప్రత్యేకించి, విజయవంతంగా నడుస్తున్న వెల్‌నెస్‌ సెంటర్ల విస్తరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఆరింటిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో ఖైరతాబాద్, వనస్థలిపురం, ఖైరతాబాద్‌ల్లో ఇప్పటికే రెండు వెల్‌నెస్‌ కేంద్రాలను ప్రారంభించడం తెలిసిందే. మిగతా 8 సెంటర్లు పూర్వపు జిల్లా కేంద్రాల్లో, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో త్వరలో ప్రారంభమవుతాయి. ఒక్కో వెల్‌నెస్‌ సెంటర్‌లో 45 మంది వైద్య సిబ్బందిని నియమిస్తారు. అందులో ముగ్గురు ఎంబీబీఎస్‌ చేసిన వారుంటారు. ఆర్థో, కార్డియాలజిస్ట్‌ సహా మొత్తం ముగ్గురు స్పెషలిస్టులుంటారు. గైనకాలజిస్ట్, జనరల్‌ మెడిసిన్, డెంటల్, పిల్లల వైద్య నిపుణులుంటారు. వెల్‌నెస్‌ కేంద్రాల్లో డెంటల్, ఫిజియోథెరపీ, ఎలక్ట్రో థెరపీ తదితర సేవలుంటాయి. వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.34.02 కోట్లు, మందులకు రూ.91 కోట్లు, ఔట్‌ పేషెంట్ల పరీక్షలకు రూ.45.2 కోట్లు కేటాయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement