బొగ్గుకూ పైసల్లేవ్! | Sakshi
Sakshi News home page

బొగ్గుకూ పైసల్లేవ్!

Published Thu, May 28 2015 12:50 AM

బొగ్గుకూ పైసల్లేవ్! - Sakshi

* ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర జెన్‌కో
* సొంత అవసరాలకు వెయ్యి కోట్ల అప్పు
* బొగ్గు కొనుగోళ్ల బకాయిలు రూ.1,800 కోట్లు
* సర్కారుకు ఫిర్యాదు చేసిన సింగరేణి

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్‌కో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా? రూ.42 వేల కోట్లతో భారీగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్న జెన్‌కో కనీసం బొగ్గు కొనుగోలుకు డబ్బులు చెల్లించలేని దీనస్థితిలో ఉందా? సంస్థ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే విస్మయం కలిగిస్తోంది. సింగరేణి సంస్థ నేరుగా ప్రభుత్వానికే ఫిర్యాదు చేయడంతో జెన్‌కో డొల్లతనం బయటపడింది. బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి బకాయిపడిన రూ.1800 కోట్లు చెల్లించాలంటూ జెన్‌కోకు పలుమార్లు లేఖలు రాసిన సింగరేణి.. చివరకు దీనిపై రాష్ర్ట ఆర్థిక శాఖకే లేఖ రాసింది. తమ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
 
 దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్‌కో ప్రభుత్వ కార్పొరేషన్ కావడంతో ఆర్థిక లావాదేవీలు, ఆదాయవ్యయాలన్నీ ఆ సంస్థ పరిధిలోనే ఉంటాయి. దీంతో తాము చేసేదేమీ లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు ఈ లేఖను పక్కనబెట్టారు. అయితే బొగ్గుకు డబ్బులు చెల్లించలేని విపత్కర పరిస్థితిలో జెన్‌కో ఉందా అనేది ఆర్థిక శాఖలో చర్చనీయాంశమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత, విద్యుత్ సబ్సిడీ తదితర కారణాలతో డిస్కంలు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయాయి.
 
 కానీ విద్యుదుత్పత్తి, అమ్మకాల ద్వారా లాభాలను ఆర్జించాల్సిన జెన్‌కో కూడా బొగ్గు బకాయిలను చెల్లించకపోవ డం ప్రభుత్వవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణ ఖర్చులు, రోజువారీ అవసరాలకు ఆ సంస్థ ఇటీవల రూ.1000 కోట్లు అప్పు తెచ్చుకోవడం గమనార్హం. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) నుంచి వర్కింగ్ కాపిటల్‌గా ఈ రుణాన్ని సమకూర్చుకుంది. వాస్తవానికి జెన్‌కోకు డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలున్నాయి. ఏపీలోని రెండు డిస్కంల నుంచి రూ.1660 కోట్లు, తెలంగాణలోని ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ నుంచి రూ. 550 కోట్లు రావాల్సి ఉంది.

కానీ అంతకంతకు సర్దుబాటు వ్యయం కూడా ఉండటంతో సంస్థ చిక్కుల్లో పడింది. అందుకే సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త విద్యుత్ ప్రాజెక్టులన్నింటికీ జెన్‌కో ప్రైవేటు సంస్థల రుణాలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త ప్లాంట్లకు రూ.24 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆర్‌ఈసీ ఇటీవలే అంగీకరించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) కూడా రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతోపాటు ప్రభుత్వం ఈక్విటీగా సమకూర్చే రూ.3000 కోట్లను జెన్‌కో వినియోగించుకోనుంది. ఈ లెక్కన జెన్‌కో రుణాలు, ప్రభుత్వ ఈక్విటీపైనే ఆధారపడ్డట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement