'రుణ మాఫీ లేదు... కొత్త రుణాలు లేవు' | Sakshi
Sakshi News home page

'రుణ మాఫీ లేదు... కొత్త రుణాలు లేవు'

Published Wed, Apr 29 2015 8:25 PM

'రుణ మాఫీ లేదు... కొత్త రుణాలు లేవు'

- బీఈడీ చదివిన వారికీ ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం ఇవ్వాలి
- జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రుణ మాఫీ హామీని అమలు చేయకపోగా కొత్త రుణాలు మంజూరులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని పీపీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీఈడీ చదివిన వారికి కూడా పశ్చిమ బెంగాల్ తరహాలో ఎస్‌జీటీ పోస్టులకూ అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్టీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్‌తో కలిసి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2014-15లో పంట రుణాలను కనీసం రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు బీమా చెల్లించలేక దాదాపు రూ. 2 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిదన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ భారాన్ని అంతా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్‌కు గాను పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారంగా రూ. 7360 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా అందులో కేవలం రూ. 1260 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగిలిన రూ. 6100 కోట్లను వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున పంటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ చదివిన వారిని కూడా అర్హులుగా పరిగణిస్తూ పరీక్షకు అనుమతించేలా చూడాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఈడీ చదివిన వారిని ఎస్‌జీటీ పోస్టులకు అర్హులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మే నెల 9 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు సాధించేలా చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులు బీఈడీ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వీరిలో చాలా మందికి వయో పరిమితి దాటి పోతుందనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా బీఈడీ చదివిన వారికి ఎస్‌జీటీలుగా నియమించేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినందున ప్రభుత్వం స్పందించాలన్నారు. బీకాం, బీఈడీ విద్యార్హతలున్న వారిని టీచర్ పోస్టులకు అనర్హులుగా పరిగణిస్తూ హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదని వారికి కూడా న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement