విద్యుత్ వెల్లువ! | Sakshi
Sakshi News home page

విద్యుత్ వెల్లువ!

Published Sat, Jun 6 2015 3:18 AM

విద్యుత్ వెల్లువ! - Sakshi

⇒ 2,000 మెగావాట్లకు స్వల్పకాలిక ఒప్పందాలు
⇒ పరిశీలనలో మరో 400 మెగావాట్ల ఆర్డర్లు
⇒ గరిష్టంగా 8,100 మె.వా.కు సన్నాహాలు
⇒ ఏపీ వదులుకోవడంతో రాష్ట్రానికి ఆఫర్ల క్యూ

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తొలినాళ్లలో రాష్ట్రం విద్యుత్ కొరతను ఎదుర్కొంది. అప్పట్లో విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినా ఎక్కడా విద్యుత్ లభించలేదు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి రాష్ట్రానికి విద్యుత్ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలు తెలంగాణకు విద్యుత్ విక్రయించేందుకు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్ ఉండటంతో అక్కడి ప్రభుత్వం దాదాపు 2 వేల మెగావాట్ల వరకు ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంది.

ఈ నేపథ్యంలో తమ విద్యుత్‌ను తెలంగాణకు విక్రయించేందుకు ఆయా ప్రైవేటు సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అవసరంలో అందివచ్చిన అవకాశంలాగా వచ్చిన ఈ ఆఫర్లను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. ప్రస్తుత జూన్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 2,000 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు పలు సంస్థలతో స్వల్ప కాలిక కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్‌కు రూ. 6 నుంచి రూ. 6.45 వరకు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మరో 500 మెగావాట్లకు సంబంధించిన పలు ఆఫర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

సొంత ఉత్పత్తి, కేంద్ర ఉత్పత్తి సంస్థలు (సీజీఎస్), ప్రైవేటు కొనుగోళ్లు కలుపుకొని 5,900 మెగావాట్ల నుంచి 6,500 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండును పూడ్చగలమని అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి పెరిగితే రోజువారీ డిమాండు 8,100 మెగావాట్లకు పెరుగుతుందని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు సరఫరా కోసం కావాల్సిన విద్యుత్ కొనుగోళ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.  
 
 గ్యాస్ విద్యుత్ వచ్చేస్తోంది..
  ఆంధ్రప్రదేశ్‌లోని గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలైన ల్యాంకో, జీఎంఆర్, జీవీకే, ఆర్‌వీకేల నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ను రానున్న 4 నెలల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విద్యుత్ సరఫరా ప్రారంభం కానుంది. అదే విధంగా నెల్లూరులోని థర్మల్ పవర్ టెక్ నుంచి ప్రస్తుతం రాష్ట్రానికి 270 మెగావాట్లు వస్తుండగా, వచ్చే ఆగస్టు నుంచి రానున్న 8 ఏళ్ల కాలం వరకు 540 మెగావాట్ల విద్యుత్ రానుంది. ఈ మేరకు ఇరువర్గాల మధ్య ఒప్పందం జరిగింది.

Advertisement
Advertisement