తమ్ముడి మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అక్కకు.. | Sakshi
Sakshi News home page

పురిటి నొప్పులతో గర్భిణి అవస్థ

Published Wed, Aug 22 2018 11:20 AM

No Road In Palagudem Village - Sakshi

గుండాల భద్రాద్రి జిల్లా : పాలగూడెం.. గుండాల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామం. అయితే అభివృద్ధిలో మాత్రం చాలా దూరంలో ఉంది. ఆ ఊరికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. మామూలు రోజుల్లో అయితే ఉన్న డొంక రోడ్డు నుంచే ఆటోలు, మోటార్‌ సైకిళ్లు వెళ్తుంటాయి. కానీ ఇటీవలి వర్షాలు ఆ సౌకర్యాన్ని కూడా గంగలో ముంచాయి. అత్యవసర సమయాల్లో మండల కేంద్రానికి లేదా ఏ ఆస్పత్రికి వెళ్లాలన్నా అక్కడి గిరిజనులకు నరకయాతనే.

నిండు గర్భిణులు, జ్వర పీడితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు మృతదేహాలకు కూడా తిప్పలు తప్పడం లేదు. మంగళవారం జరిగిన ఓ ఘటన ఈ గ్రామ దుస్థితికి అద్దం పడుతోంది. గ్రామానికి చెందిన కొడెం నరేష్‌(20) కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

దీంతో మృతదేహాన్ని కొడవటంచ వరకు వాహనంలో, అక్కడి నుంచి ఎడ్లబండి ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎడ్లబండి కూడా అందుబాటులో లేకపోవడం, ఇటీవల వర్షాలకు రోడ్డు ఛిద్రమై కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కావడి ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని కొడవటంచ వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనం ద్వారా ఇల్లెందుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఎడ్లబండ్లే శరణ్యం..    

పాలగూడెం గ్రామంలో 46 కుటుంబాల ఉండగా 164 మంది జనాభా ఉన్నారు. మండల కేంద్రం నుంచి 7  కి.మీ. (కొడవటంచ వరకు) మట్టి రోడ్డు ఉండగా ఆటోలు, దిచక్రవాహనాలు మాత్రమే తిరుగుతుంటాయి. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలగూడెం వెళ్లాలంటే నరకయాతనే. పురుగుమందు తాగినా, విష పురుగులు కాటేసినా, నిండు గర్భిణులైనా అత్యవసర  వైద్యం పొందాలంటే ఎండ్లబండ్లే శరణ్యం.

ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక మొహం చాటేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఉన్న మట్టి రోడ్డు కూడా ఇటీవలి వర్షాలకు దెబ్బతినడంతో మరీ ఇబ్బందిగా మారిందని, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చెపుతున్నారు.

ఇక పక్కనే ఉన్న నాగారం గ్రామానిదీ అదే పరిస్థితి. అక్కడ 50 కుటుంబాలుండగా 190 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. ఆ గ్రామానికి వెళ్లాలన్నా 4 కి.మీ.కాలినడకనే. ఇటీవల వర్షాలకు కొడవటంచ వద్ద ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇటీవల పర్శిక శిరీష అనే మహిళ పురిటి నొప్పులతో బాదపడుతుండగా అతి కష్టం మీద కిన్నెరసాని పైనుంచే తరలించారు. ఇంకా నడిమిగూడెం, సజ్జలబోడు తదితర గ్రామాల్లోనూ ఇలాంటి సమస్యలే విలయతాండవం చేస్తున్నాయి. ఏ అధికారీ అటువైపు వెళ్లిన పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కష్టాలను తీర్చాలని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. 

మృతుడి సోదరికి పురిటినొప్పులు.. 

గుండాల: తమ్ముడు చనిపోయాడనే విషయం తెలిసి పుట్టింటికి వచ్చిన అక్కకు అదే సమయంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. 108 ఆంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ద్విచక్రవాహనం,  ఆటోల ద్వారా అష్టకష్టాలు పడుతూ గుండాల ఆస్పత్రికి చేరింది. సోదరుడు నరేష్‌ ఆత్మహత్య చేసుకోవడంతో కరకగూడెం మండలం కొత్తూరు నుంచి అక్క ఈసం స్వప్న పాలగూడెం వచ్చింది. తమ్ముడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు గ్రామ పొలిమెరల్లోకి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.

తన ఫోన్‌ అప్పటికే స్విచ్‌ఆఫ్‌ అయింది. అక్కడున్న పిల్లల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే ఆశావర్కర్‌ వచ్చి 108కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాచారం వచ్చింది. అద్వానంగా ఉన్న బురదరోడ్డుపై ద్విచక్రవాహనంపై కొడవటంచ వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆటోలో గుండాల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మార్గం మద్యలో ఆమె పడిన అవస్థలు వర్ణణాతీతం.     

Advertisement
Advertisement