ముహూర్తం కుదిరింది | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది

Published Sat, Nov 10 2018 9:10 AM

Nominations From Monday in Telangana Elections - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎన్నికల రాజకీయం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రధానమైన నామినేషన్ల ప్రక్రియకు ముఖ్య నేతలు ముహూర్తం నిర్ణయించుకున్నారు. మండే మంచిదని, పైగా కార్తీకమాసం తొలి సోమవారం శుభప్రదమని భావించి ఆ రోజే నామినేషన్‌ వేయాలని యోచిస్తున్నారు. అప్పటి నుంచే నగరంలో నామినేషన్ల సందడి మొదలు కానుంది. అత్యధిక నామినేషన్లు 12వ తేదీన వేయనున్నారు. దీంతోపాటు నామినేషన్ల స్వీకరణకు చివరిరోజైన రెండో సోమవారం 19 తేదీన కూడా భారీ సంఖ్యలో వేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్‌ అభ్యర్థి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ భారీ ర్యాలీతో తొలి సోమవారమే నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు. అదేరోజు మేడ్చల్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఎంపీ మల్లారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రెండో రోజైన మంగళవారం, 15,16 తేదీల్లో అష్టమి, నవమి అంతగా మంచిది కాదని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. దీంతో ఆ రోజుల్లో నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 14వ తేదీ సప్తమి, 17వ తేదీ దశమి వస్తుండడంతో ఆయా అభ్యర్థులపేర్లపై బాగుంటే నామినేషన్లు వేసుకోవచ్చని జ్యోతిష్యులు సలహా ఇస్తున్నారు. ఇక నామినేషన్లకు చివరి రోజు.. నవంబర్‌ 19(సోమవారం) ఏకాదశి, ద్వాదశి తిథుల కలయికతో పాటు ఉత్తరాభాద్ర విశేషకాలం కావడంతో ఆ రోజు ఎంతో మంచిదని పేర్కొంటున్నారు. దీంతో చివరి రోజునే భారీగా నామినేషన్లు వేయాలని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద్, కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ చివరిరోజే తమ ముహూర్తంగా ఎంచుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా, టీఆర్‌ఎస్‌ తుది జాబితాలు శని, ఆదివారాల్లో విడుదలవుతుండడంతో నగరమంతటా రాజకీయ వాతావరణం మరింత స్పీడందుకోనుంది. 

Advertisement
Advertisement