ఏదీ రాజ‘మార్గం?’ | Sakshi
Sakshi News home page

ఏదీ రాజ‘మార్గం?’

Published Wed, Jul 1 2015 3:27 AM

ఏదీ రాజ‘మార్గం?’ - Sakshi

ముందుకు కదలని పనులు  
భూ సేకరణే ప్రధాన అవరోధం
టెండర్లలో జాప్యం  
ప్రారంభంపై సందిగ్ధం
సాక్షి, సిటీబ్యూరో:
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రాచమార్గాల పనులు ఎప్పుడు మొదలవుతాయో... ఎప్పుడు పూర్తవుతాయో... అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా... రయ్య్‌న దూసుకుపోయేలా... అంతర్జాతీయ ప్రమాణాలతో రాచమార్గాలు (ఫ్లై ఓవర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్లు, స్కైవేలు) నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వనగరంలో భాగంగా రూ.20 వేల కోట్లకు పైగా వెచ్చించి... వీటిని నిర్మించాలనేది లక్ష్యం.

తొలిదశలో రూ.4,051 కోట్ల పనులను బీఓటీ-యాన్యుటీ పద్ధతిలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టెండర్ల విధి విధానాల ఖరారుకు గాను ఉన్నత స్థాయి కమిటీ నియామకానికి సమయం పట్టింది. తీరా కమిటీ ఏర్పాటయ్యాక  టెండర్లు పిలుస్తారని అంచనా వేసినప్పటికీ... ఇప్పుడప్పుడే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ పిలిచినా.. పనులు చేపట్టేందుకు తొలిదశలో ఎంపిక చేసిన ఇరవై మార్గాల్లో 581 ప్రైవేట్ ఆస్తులను సేకరించాల్సి ఉంది.

ఎంతో డిమాండ్ ఉన్న ప్రధాన రహదారుల్లో గల ఈ ఆస్తులు సేకరించడం అంత సులువు కాదు. మెట్రో రైలు పనులకు భారీ నష్ట పరిహారాలు.. వెనువెంటనే చెల్లింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ 300కు పైగా ఆస్తులకుగాను ఇంకా 42 సేకరించాల్సి ఉంది. ఐదేళ్లుగా సేకరిస్తున్నా.. ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన రహదారి విస్తరణకు ఉప్పల్ మార్గంలో దాదాపు 180 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అనుభవాల నేపథ్యంలో రాచమార్గాలకు ఆస్తులను సేకరించేందుకు ఎంత కాలం పడుతుందో చెప్పే పరిస్థితి లేదు.
 
తక్కువ సేకరించాల్సిన చోట...
తొలిదశలో 20 మార్గాల్లో రూ.4051 కోట్లతో పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. దీంతో ఏ మార్గంలో ఎంత మేర ఆస్తులు/భూ సేకరణ అవసరమో అధికాారులు సర్వే చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కలిపి సుమారు 80 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్తుల పరంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ... ప్రైవేట్ ఆస్తుల సేకరణ పెనుభారంగా మారనుంది. సంబంధితయజమానులను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

దీనికి నష్ట పరిహారం దాదాపు రూ.1500 కోట్లుగా అంచనా వేశారు. ఇవి పోనూ... మిగతా నిధులు దాదాపు రూ.2551 కోట్లతో రాచమార్గాలను నిర్మించనున్నారు. ఏమార్గంలో ఆస్తుల సేకరణ అతి తక్కువగా ఉంటుందో అక్కడ తొలుత పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అయితే... యాన్యుటీ విధానంలో పిలవనున్న ఈ టెండర్లకు ఎలాంటి స్పందన ఉంటుందో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు.
 
- మైండ్‌స్పేస్ జంక్షన్‌లో సేకరించాల్సిన ఆస్తుల కోసం ఇంకా లెక్కలు వేస్తున్నారు. దీనికి దాదాపు రూ.200 కోట్లు అవసరమని అంచనా. సైబర్ టవర్స్ జంక్షన్‌లో 9 ఎకరాల సేకరణకు కచ్చితంగా ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేస్తున్నారు.
- వీటితో పాటు వివిధ మార్గాల్లో సేకరించాల్సిన ప్రభుత్వ ఆస్తులు/భూములు 49.15ఎకరాలు ఉన్నాయి.

Advertisement
Advertisement