రిజిస్ట్రేషన్ల శాఖ ఇక నగదు రహితం! | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల శాఖ ఇక నగదు రహితం!

Published Fri, Dec 30 2016 3:23 AM

Now onwards cash-free in the Registration Department

- జనవరి 15లోగా ‘నగదు రహిత లావాదేవీల’కు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం
- రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పీవోఎస్‌ల ఏర్పాటు
- సిద్దిపేటలో నేటి నుంచి అమలు

సాక్షి, హైదరాబాద్‌: నగదు రహిత లావాదేవీల(క్యాష్‌లెస్‌) దిశగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ–చలాన్ల ద్వారా అధిక మొత్తం లావాదేవీలను క్యాష్‌లెస్‌గా మార్చిన అధికారులు, తాజాగా సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయాల్లో చిన్న మొత్తాల చెల్లింపుతో చేసే లావాదేవీలనూ డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా(ఎస్సార్వో)ల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీవోఎస్‌) మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పూర్తి నగదు రహిత లావా దేవీల ప్రక్రియ అమలులో భాగంగా తొలుత సిద్దిపేట నియోజకవర్గంలోని అర్బన్, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి పైలెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.  ఇందులో సమస్యలను  పరిష్క రించే బాధ్యతను నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) కు రిజిస్ట్రేషన్ల శాఖ అప్పగించింది. సిద్దిపేటలో పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే జనవరి 15లోగా రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ పీవోఎస్‌ మెషీన్లను ఏర్పాటు చేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది.

నగదు రహిత లావాదేవీలు ఇలా..
ప్రస్తుతం ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికేట్‌(ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ, వీలునామా, వివాహ రిజిస్ట్రేషన్ల నిమిత్తం రిజిస్ట్రేషన్ల శాఖలో నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తాల్లో ఉండే ఆయా ఫీజులను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయంలోనే వినియోగదారులు నేరుగా చెల్లిస్తున్నారు. ఈ తరహా లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా రూ.130కోట్ల నుంచి రూ.150కోట్ల దాకా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్ల శాఖను సంపూర్ణంగా క్యాష్‌లెస్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇకపై ఎస్సార్వోలలో చెల్లించే చార్జీలను కూడా వినియోగదారులు డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసీ కోసం రూ.200, సీసీ కోసం రూ.120, వివాహ రిజిస్ట్రేషన్‌కు రూ.100, వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.1000 మొత్తాలను ఇకపై నగదు తీసుకెళ్లకుండానే వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్‌ కార్డులతో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి సాంకేతిక సేవలందిం చేందుకు ఏర్పాటు చేసుకున్న ఫెసిలిటీ మేనేజర్‌ (టీసీఎస్‌) కాంట్రాక్ట్‌ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఫెసిలిటీ మేనేజర్‌ను నియమించి, మెరుగైన ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందించాలని అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement