లావెక్కుతున్నావు తెలుగోడా! | Sakshi
Sakshi News home page

లావెక్కుతున్నావు తెలుగోడా!

Published Sun, Nov 5 2017 1:02 AM

obesity increasing in telugu states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బొద్దుగా ఉంటే ముద్దు... అనేది పాత మాట. చక్కనమ్మ ఎంత చిక్కినా అందమే అనేది కొత్త మాట... ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఇప్పుడు ఎక్కువ మంది బరువు తగ్గించే పనిలో నిమగ్నమవుతున్నారు. మెజారిటీ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. దేశ వ్యాప్తంగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువవుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అందరి శరీరాల్ని మార్చేస్తున్నాయి. పురుషులు, మహిళలు తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ మంది బాధితులున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో బరువు పెరుగుతున్న అంశాలపై సర్వే నిర్వహించారు. నగరాలు/పట్టణాలు, గ్రామాల్లోని వారిని ఎంపిక చేసి వివరాలు నమోదు చేసింది.

దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని 28.1 శాతం మంది మహిళలు, 24.2 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించే మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నవారే. గ్రామీణ మహిళల్లో ఈ సమస్యతో బాధపడుతున్న వారు 18.5 శాతం మంది ఉండగా, పురుషులు 14 శాతం మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అధిక బరువు సమస్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. అధిక బరువు సమస్య ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంకా ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.

జీవనశైలే ప్రధాన కారణం...
ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పులే.. శరీర బరువు పెరుగుదలకు కారణాలవుతున్నాయని కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. శారీరక శ్రమలేని వృత్తిలోకి ఎక్కువ మంది వస్తుండడం కూడా దీనికి ప్రధాన కారణం. ‘చిన్నప్పటి నుంచి ఆటలకు దూరంగా ఉండడంతో కొత్త తరంలో ఎక్కువ మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో ఒకప్పటిలాగా తక్కువ ఆహారం తీసుకునే పరిస్థితి మారింది. రెడిమేడ్‌గా ఉండే ఆధునిక ఆహార పదార్థాలు అందుబాటులో ఉండడంతో రోజులో ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు. ఇవన్నీ అధిక బరువుకు కారణమవుతున్నాయి’అని పిల్లల వైద్య నిపుణులు ఎం.శేషుమాధవ్‌ తెలిపారు.

Advertisement
Advertisement