భూకబ్జాకు ఎత్తుగడ! | Sakshi
Sakshi News home page

భూకబ్జాకు ఎత్తుగడ!

Published Fri, Sep 19 2014 11:26 PM

officials and real estate developers are merge

ఘట్‌కేసర్: భూ కబ్జాకు కొత్త ఎత్తుగడ వేశా రు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేశారు. మండల పరిధిలోని పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇంత చేస్తున్నా గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం నీడలో నిద్రపోతు న్నారు. అంతేకాకుండా సంస్కృతి టౌన్‌షిప్ కాలనీ ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం బాధ్యులు సైతం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల విలువైన స్థలం దక్కించుకోవడానికి భవన నిర్మాణ సంస్థ కుట్ర పన్నుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు.
 
ఇందులో భాగంగా నిర్మాణానికి సంబంధించిన అనుమతులు హౌసింగ్ బోర్డుతో రద్దయ్యాయి. దీంతో ఆ భవన నిర్మాణ సంస్థ  తాత్కాలిక షాపింగ్ కాంప్లెక్స్ పేరిట తిరిగి నిర్మాణాలను చేపట్టింది. ఇందులో కొన్ని షాపుల నిర్మాణాలు పూర్తయ్యాయి. పంచాయతీ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా సదరు గ్రామ పంచాయతీకి చెందిన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఈ భవన నిర్మాణ సంస్థ అవేవీ పట్టించుకోకుండానే నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.
 
గడువు దాటినా నిర్మించకపోవడంతో..
మండలంలోని పోచారంలో 130 ఎకరాల్లో 2001లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు సంస్కృతి టౌన్‌షిప్ పేరిట ప్లాట్ల నిర్మాణాలు చేపట్టి కొనుగోలుదారులకు విక్రయించింది. అప్పటి హౌసింగ్ బోర్డు కాలనీవాసులకు నిత్యావసర వస్తువుల సరఫరాకు దుకాణా సముదాయం నిర్మాణానికి టెండర్లు పిలిచింది. స్పెక్‌సిస్టం లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ టెండర్ దక్కించుకుంది. సదరు సంస్థ రెండేళ్లలోపు మూడెకరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామని హౌసింగ్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల దాటినా సదరు సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర హౌసింగ్ బోర్డు 2010 వరకు పొడిగించింది.
 
అయినా భవన నిర్మాణ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో హౌసింగ్ బోర్డు అధికారులు... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన మూడు ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు.. టెండర్ దక్కించుకున్న సంస్థకు నోటీసులు ఇచ్చారు.  షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కొత్త టెండర్లను ఆహ్వానించింది. దీంతో స్పెక్ సిస్టం సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.  టెండర్లు స్వీకరించినప్పుటికీ తుది నిర్ణయం తీసుకోవద్దని హౌసింగ్ బోర్డుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
అధికారులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్పెక్ సిస్టం సంస్థకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తిరిగి రెండు సంవత్సరాల కాలపరిమితి పొడిగించింది. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పటి హౌసింగ్ బోర్డు అధికారులతో కుమ్మక్కై  స్థలం కాజేయడానికి.. తమకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ స్థలం తమ ఆధీనంలో ఉందనడానికి బినామీల పేర్లతో షాపులు నిర్మిస్తున్నారు. షాపుల పేరుతో స్థలాన్ని కాజేసి అక్కడ దుకాణ సముదాయం నిర్మించడానికి కుట్ర పన్నుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మితమవుతున్న షాపులకు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.  ఈ విషయంపై పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులకు, డీపీఓ, గ్రామ పంచాయతీ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు.
 
పంచాయతీ అనుమతులు లేవు: కార్యదర్శి సునీత
పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతులు లేవని శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సునీత తెలిపారు. నిర్మాణాలను నిలిపి వేయాలని హెచ్చరించాం. ఒకవేళ స్పందించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement