పింఛన్ తంటాలు | Sakshi
Sakshi News home page

పింఛన్ తంటాలు

Published Sun, Dec 14 2014 5:09 AM

పింఛన్ తంటాలు - Sakshi

జీవితానికి ఆసరా కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ జాబితాలో పేరు లేదని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నపానీయాలు మానుకుంటున్నారు. ఆందోళన బాట పడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పింఛన్ల జాబితాలో పేరు లేదని ఆరుగురు చనిపోయారు. నిజామాబాద్‌లో ఎంపీ కవితను అడ్డుకున్నారు. వరంగల్‌లో దీక్షలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓ వృద్ధురాలు అన్నపానీయాలు మానేసి నిరసన వ్యక్తం చేస్తోంది. మరోపక్క అధికారులు నిర్లక్ష్యంతో అనర్హులకు ఆసరా దక్కుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
పింఛన్ కోసం అన్నపానీయాలు బంద్
రెండు రోజులుగా వృద్ధురాలి నిరసన
ఆందోళనలో కుటుంబ సభ్యులు

 
తూప్రాన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ జాబితాలో తన పేరు లేదని ఓ వృద్ధురాలు రెండు రోజులుగా అన్నపానీయాలు మానేసి నిరసన తెలుపుతోంది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పోచమ్మ (85) వితంతువు. కాగా.. అప్పులబాధతో పన్నెండేళ్ల క్రితం కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్త, కోడళ్లు వితంతు పింఛన్ తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు రూ.1000 అంది స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద వీఆర్‌ఓ అరుణ గ్రామానికి చెందిన అర్హుల జాబితా అతికించింది.
 
 అందులో గ్రామానికి చెందిన 09 మంది కి చెందిన వితంతువుల పేర్లు లేవు. విషయం తెలుసుకున్న పిట్ల పోచమ్మ తనకున్న ఒక్క ఆసరా రాకుండా పోయిందని బాధపడుతూ శుక్రవారం నుంచి అన్నపానీయాలు మానేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా ఏమీ తీసుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి పింఛన్లు రాని వారికి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా వృద్ధురాలు మాత్రం అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement