రింగ్ పక్కన చెత్త! | Sakshi
Sakshi News home page

రింగ్ పక్కన చెత్త!

Published Thu, Aug 6 2015 11:49 PM

రింగ్ పక్కన చెత్త! - Sakshi

శివారు గ్రామాల ముక్కుపుటాలదిరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డును హరితహారంగా మలుస్తామని ప్రకటించిన కొన్నాళ్లకే.. ఈ రోడ్డు నిర్మాణానికి తవ్విన గోతులను ‘డంపింగ్ యార్డు’లుగా మార్చాలని నిర్ణయించింది. మట్టి, కంకర తవ్వకాలతో పెద్ద గోతులతో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఔటర్‌కు ఇరువైపులా లీజు ముగిసిన క్వారీలను గ్రేటర్ చెత్తతో నింపేసేలా
 ప్రణాళిక తయారు చేసింది.

- జవహర్‌నగర్‌పై భారాన్ని తగ్గించే ఆలోచన
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం
- ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
- హైదరాబాద్‌లో రోజుకు సగటున 3,800 టన్నుల చెత్త
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
ఇటీవల రింగ్‌రోడ్డుపై చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల హరితహారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే, తాజాగా ఔటర్ రహదారి నిర్మాణానికి తరలించిన మట్టితో ఏర్పడిన గుంతలను చెత్త డంపింగ్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో సగటున రోజుకు 3,800 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 90శాతం జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ చెత్తను వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు.

అయినప్పటికీ, భూగర్భజలాలు కలుషితం కావడం, రోగాల బారిన పడుతుండడంతో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ గోతులను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ సమతుల్యత, కాలుష్య సమస్యను అధిగమించేందుకు సరికొత్త టెకా్నాలజీని ఉపయోగిస్తామని, చెత్తను వేర్వేరుగా విభజించడం ద్వారా దుర్వాసనకు తావివ్వకుండా మట్టి పొరలతో నింపేస్తామని యంత్రాంగం చెబుతోంది. జవహ ర్‌నగర్‌లోనూ ఈ విధానం అమలు చేస్తున్నా కంపు కొడుతోందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

- కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్, గాజులరామారంలో లీజు పరిమితి ముగియడంతో 22 క్వారీలను రద్దు చేశారు. సర్వే నం.307, 308, 329/1, 79, 342లలో 148.26 ఎకరాల విస్తీర్ణంలోని 20 క్వారీల నుంచి మట్టి, కంకరను తీశారు. ఏడు మీటర్ల లోతుతో 34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపిన ఈ ప్రాంతాన్ని డంపింగ్‌యార్డుకు ఉపయోగించుకున్నారు. నిజాంపేట్ సర్వే నం.332లో 14.97 ఎకరాల్లో ఉన్న రెండు క్వారీలు కూడా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్నాయి. దాదాపు 6.67 క్యూబిక్ మీటర్ల మేర ఖనిజ వనరులను ఇక్కడ నుంచి తరలించారు.
- శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని 16 క్వారీల లెసైన్స్‌ను రద్దు చేశారు. స్థానికుల అభ్యంతరం మేరకు లీజును నిలిపివేశారు. దాదాపు 74.13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గుంతల నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి/ కంకరను తీశారు. మరో 20శాతం మేర తొలిగించారు. వీటిని కూడా డంపింగ్ యార్డు ప్రతిపాదనల్లో చేర్చారు.
- తుక్కుగూడ -పెద్దఅంబర్‌పేట్ జంక్షన్ వరకు ఔటర్ నిర్మాణ  పనులు దక్కించుకున్న ‘గాయిత్రీ’ కాంట్రాక్టు సంస్థ ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలను జరిపింది. సర్వేనం. 300/1లో ఈ మట్టిని తొలగించిన సదరు సంస్థ.. దీన్ని ఔటర్ నిర్మాణంలో వినియోగించింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన క్వారీని గార్బెజ్ డంపింగ్ కోసం వాడుకోవాలని నిర్ణయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement